IND vs ENG: సచిన్ టెండూల్కర్ 19 ఏళ్ల నాటి చారిత్రాత్మక వన్డే రికార్డుపై విరాట్ కోహ్లీ కన్ను
ఈ వార్తాకథనం ఏంటి
స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన టీమిండియా, ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్ధమైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్‌లో తొలి వన్డే ఫిబ్రవరి 6, గురువారం నాడు నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.
ఇప్పటికే నాగ్‌పూర్‌కు చేరుకున్న ఇరు జట్లు, మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి చేరారు.
మరోవైపు, ఇంగ్లండ్ జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ పునరాగమనం చేశాడు.
వివరాలు
సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి!
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మరో 96 పరుగులు చేస్తే, అత్యంత వేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
ప్రస్తుతం ఈ ఘనత భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు.
కోహ్లి ఇప్పటివరకు 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు.
సచిన్ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు.
సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఈ క్రమంలో కోహ్లి నాగ్‌పూర్ వన్డేలోనే ఈ దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.
వివరాలు
కోహ్లి ఫామ్‌పై సందేహాలు
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత కోహ్లి కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో సగటు 19.33 గా 58 పరుగులు (24, 14, 20) మాత్రమే చేశాడు.
ప్రస్తుతం కోహ్లి చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన కోహ్లి, 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో కూడా బరిలోకి దిగాడు.
కానీ అక్కడ కూడా కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోహ్లికి ఫామ్ తిరిగి పొందేందుకు మంచి అవకాశం.
అతడి అభిమానులు కోహ్లి తిరిగి సూపర్ ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నారు.
వివరాలు
జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.