Donald Trump: బైడెన్ ఆదేశాలకు బ్రేక్.. ట్రంప్ విధానాలకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టిన వెంటనే తన ప్రత్యేక శైలిలో పాలన ప్రారంభించారు. ఆయన ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు సంతకం చేసి సంచలనం సృష్టించారు.
తొలుత ఎనిమిది ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం, తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పెన్నును జనంలోకి విసిరేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అంతేకాదు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను రద్దు చేశారు.
ట్రంప్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికాను వైదొలగించడం, ప్రభుత్వాన్ని ప్రత్యర్థులపై ఆయుధంలా ఉపయోగించడం, వాక్ స్వేచ్ఛకు రక్షణ కల్పించడం, జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
Details
కెనడా, మెక్సికోపై 25శాతం అదనపు సుంకాలు
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కెనడా, మెక్సికోపై 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు అల్టిమేటమ్ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరు చూసి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ విస్తరణపై నియంత్రణలను తొలగించడం మరో ముఖ్య నిర్ణయంగా నిలిచింది.
బైడెన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏఐ అభివృద్ధి, ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. ట్రంప్ ఈ నియంత్రణలను పూర్తిగా తొలగించారు.
సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలని బైడెన్ ఇచ్చిన ఆదేశాలను కూడా ట్రంప్ రద్దు చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయించారు. ట్రంప్ ఈ విధానానికి అడ్డుకట్ట వేశారు.
Details
ఎలాన్ మస్క్ కు షాక్
చైనా కంపెనీ టిక్‌టాక్ విషయంలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు 75 రోజుల గడువును నిర్ణయిస్తూ, అమెరికాకు ఆ యాప్‌లో 50శాతం వాటా ఉండాలంటూ వ్యాఖ్యానించారు.
వాక్ స్వేచ్ఛపై బైడెన్ విధించిన నియంత్రణలను ట్రంప్ తీవ్రంగా పరిగణించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ను దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
విద్యుత్తు వాహనాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెస్లా యజమాని ఎలాన్ మస్క్‌కు షాక్‌ను అందించింది.
2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలన్న బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ రద్దు చేశారు.