Page Loader
Canada: గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్న కెనడా 
గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్న కెనడా

Canada: గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్న కెనడా 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఎటువంటి క్షిపణులు ప్రవేశించకుండా, అణ్వాయుధాలు సమీపించకుండా కాపాడుకునేందుకు అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థ 'గోల్డెన్‌ డోమ్‌' నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలన్న ఆసక్తిని కెనడా వ్యక్తం చేస్తోందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ స్పందిస్తూ, గోల్డెన్‌ డోమ్‌లో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

వివరాలు 

ట్రంప్‌తో ఉన్నతస్థాయిలో చర్చలు

మార్క్‌ కార్నీ మాటల్లో మాట్లాడుతూ.. "అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ ప్రణాళికలో భాగస్వామ్యం కావడానికి మేము చర్చలు జరుపుతున్నాం.ఇది కెనడా పౌరుల భద్రత దృష్ట్యా చక్కటి ఆలోచన. భవిష్యత్తులో కెనడా పై అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల ముప్పును ఇది సమర్థంగా ఎదుర్కొనగలదు. ఇందుకు సంబంధించి ట్రంప్‌తో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపే దిశగా ప్రయత్నిస్తున్నాం. గోల్డెన్‌ డోమ్‌ను మేమే స్వతంత్రంగా నిర్మించాలా? లేక అమెరికాతో భాగస్వామ్యం కావాలా? అన్న అంశంపై కూడా మేము లోతుగా ఆలోచిస్తున్నాం" అని వివరించారు.

వివరాలు 

అమెరికా గగనతలంలో ఆయుధాలను మోహరించే దిశగా అడుగులు

ఇజ్రాయెల్‌ రూపొందించిన 'ఐరన్‌ డోమ్‌' రక్షణ వ్యవస్థ తరహాలోనే అమెరికా 'గోల్డెన్‌ డోమ్‌'ను అభివృద్ధి చేయనున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. దీనితో అమెరికా గగనతలంలో ఆయుధాలను మోహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికను యూఎస్‌ స్పేస్‌ ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ గుట్లీన్‌ పర్యవేక్షించనున్నారని ట్రంప్‌ తెలిపారు. తన పదవీకాలం ముగిసేలోపు ఈ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే క్షిపణుల దాడులను, అంతరిక్షం నుంచి జరిగే దాడులను అడ్డుకునే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రత కోసం ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.

వివరాలు 

గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంపై చైనా, రష్యాలు తీవ్ర అభ్యంతరం

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ట్రంప్‌ అంచనా ప్రకారం సుమారు 175 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని చెప్పారు. అయితే అధికారులు ఇచ్చిన అంచనాల ప్రకారం వ్యయం 542 బిలియన్‌ డాలర్ల వరకు చేరవచ్చని తెలియజేశారు. గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంపై చైనా, రష్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతరిక్షాన్ని యుద్ధ భూమిగా మార్చే ప్రమాదం ఈ వ్యవస్థ వల్ల ఉందని, ఇది ప్రపంచ స్థాయిలో తీవ్రమైన అస్థిరతను కలిగించే ప్రమాదముందని అవి హెచ్చరిస్తున్నాయి.