
Trump tariff threat: వాణిజ్య చర్చలలో భారత్'కాస్త మొండిగా వ్యవహరిస్తోంది'.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతిస్పందనగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ సుంకాలు విధించారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, సుంకాల విషయంలో భారత్ కొంత కఠినమైన, మొండి ధోరణి అవలంబిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వైఖరి కారణంగానే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. భారత్‌తో సహా స్విట్జర్లాండ్, ఇతర దేశాలతో పెద్ద పెద్ద వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయని అన్నారు. అక్టోబర్ చివరినాటికి న్యూఢిల్లీ సహా ప్రధాన దేశాలన్నింటితో చర్చలు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కోసం ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు.
వివరాలు
ట్రంప్ నిర్ణయాలకు ప్రతిగా భారత్ కూడా గట్టిగా స్పందించింది
ట్రంప్ గతంలోనే భారత్‌కు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినా, భారత్ ఆ సూచనను పట్టించుకోలేదు. ఫలితంగా,ఆయన ముందుగా విధించిన 25శాతం సుంకాలను 50శాతం వరకు పెంచే నిర్ణయం తీసుకున్నారు. అదనంగా విధించిన ఈ 25శాతం సుంకాలు ఈ నెల 27వతేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ట్రంప్ నిర్ణయాలకు ప్రతిగా భారత్ కూడా గట్టిగా స్పందించింది.దేశంలోని రైతులు,మత్స్యకారులు, పాలు,పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యం అని,అవసరమైతే ఆర్థిక భారం తామే మోయడానికి సిద్ధమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టారిఫ్‌ల ఉద్రిక్తతల మధ్య కూడా న్యూఢిల్లీతో సంపూర్ణ చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని,అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఇప్పటికే ప్రకటించారు.
వివరాలు
త్వరలో అమెరికా పర్యటనకు మోదీ
అమెరికా పెంచిన సుంకాలు అమల్లోకి వచ్చేలోపే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రధాని మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ పర్యటనలో ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి, వాణిజ్య సంబంధిత సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.