Kim Jong un: 'ఆత్మహుతి డ్రోన్ల' ఆయుధాల్ని తయారుచేయండి కిమ్ జోంగ్-ఉన్
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భారీ స్థాయిలో ఆత్మాహుతి డ్రోన్ల తయారీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు, రష్యా సైన్యంతో కలిసి ఉత్తర కొరియా సేనలు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరిన సమయంలో, అంతర్జాతీయంగా మరింత ఆందోళనకు కారణమయ్యాయి. నిన్న కిమ్ స్వయంగా ఓ ఆత్మాహుతి డ్రోన్ పరీక్షలో పాల్గొన్నారు. భూభాగం, సముద్ర లక్ష్యాలను ఛేదించేలా ఈ డ్రోన్ పనితీరును పరిశీలించారు. వెంటనే, డ్రోన్ల ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ''ఆత్మాహుతి డ్రోన్లను అత్యంత శక్తివంతమైన, సులభంగా వినియోగించగల ఆయుధంగా అభివర్ణించారు'' అని వార్తలో పేర్కొన్నారు.
2023 ఆగస్టులో, ఉత్తర కొరియా తొలిసారిగా ఆత్మాహుతి డ్రోన్లు
2023 ఆగస్టులో, ఉత్తర కొరియా తొలిసారిగా ఆత్మాహుతి డ్రోన్లను ప్రదర్శించింది. ఈ డ్రోన్లను రష్యాతో ఉన్న సాంకేతిక సహకారంతో నిర్మించినట్లు నిపుణులు తెలిపారు. గతంలో, 2022లో ఉత్తర కొరియా చిన్న డ్రోన్లను దక్షిణ కొరియా సరిహద్దులకు పంపించింది. అప్పటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న దక్షిణ కొరియా, ప్రత్యేక డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేసింది.
ఇజ్రాయెల్ టెక్నాలజీ దొంగిలించారా?
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన ఆత్మాహుతి డ్రోన్లు, ఇజ్రాయెల్ రూపొందించిన హరోప్, హీరో-30, అలాగే రష్యా లాన్సెట్-3లను పోలి ఉన్నాయని పరిశీలకులు గుర్తించారు. ఇంకొందరు, ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇరాన్ హ్యాకింగ్ ద్వారా దొంగిలించి రష్యా ద్వారా ఉత్తర కొరియాకు చేరిన అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ డ్రోన్ల ఉత్పత్తి కిమ్ సేనలను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్తూ, ప్రాంతీయంగా మరింత ఉద్రిక్తతను పెంచుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.