
#NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన!
ఈ వార్తాకథనం ఏంటి
"ఆ రోజు మా ఊరి మీద దారుణంగా బాంబులు వేశారు. ఆ బాంబుల శకలాల్లో ఒకటి నా మూడు ఏళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు.
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఆకుల్ని గాయంపై ఉంచి, చుట్టూ బట్టలు చుట్టి బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వచ్చాం.
ఇక్కడే వైద్యం అందిందని ఇస్మత్ ఆరా అన్నారు. ఇస్మత్ అరా వంటి లక్షల మంది రోహింజ్యా శరణార్థులు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని కాక్సస్ బజార్ ప్రాంతంలోని తాత్కాలిక టెంట్లలో, వెదురు, టార్పాలిన్ తో నిర్మించిన గుడారాల్లో నివసిస్తున్నారు.
సరిగ్గా ఏడు నెలల కిందట, మియన్మార్‌లోని మౌంగ్డా ప్రాంతాన్ని వదిలి, ఇస్మత్ తన కుటుంబంతో కలిసి బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందింది.
Details
ప్రపంచంలో అత్యధికంగా హింస ఎదుర్కొంటున్న రోహింజ్యా
రోహింజ్యాలు ముస్లింలుగా ఉండగా, మియన్మార్‌లో బౌద్ధులు అధికంగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ప్రపంచంలో అత్యంత హింసను ఎదుర్కొంటున్న సముదాయాల్లో రోహింజ్యాలు ఒకటి.
ఈ సముదాయానికి చెందినవారు బంగ్లాదేశ్‌లో 34 క్యాంపుల్లో జీవిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల మందికి పైగా శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు.
ఇది ప్రపంచంలో అతిపెద్ద శరణార్థి శిబిరం. 2016లో ఏర్పడిన 'అరాకన్ రోహింజ్యా సాల్వేషన్ ఆర్మీ' అనే గ్రూప్ పోలీస్ కేంద్రాలపై దాడులు చేసి, 9 మంది అధికారులను హత్య చేసింది.
ప్రతీకారంగా మియన్మార్ సైన్యం ప్రజలపై దాడులకు దిగింది. హత్యలు, అత్యాచారాలు,చిత్రహింసలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
2017 ఆగస్టు నుంచి వేలాది రోహింజ్యా ముస్లింలు మియన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. ఇప్పటికీ ఈ వలస కొనసాగుతూనే ఉంది.
Details
ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటుతున్నారు
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి నఫ్ నది లేదా సముద్ర మార్గంలో చిన్న పడవల్లో ప్రయాణిస్తూ లేదా అడవుల్లో ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తూ వేలాది మంది బంగ్లాదేశ్ చేరుకుంటున్నారు.
ఈ దాడులను ఐక్యరాజ్యసమితి 'జాతి హననం'గా ప్రకటించింది.
మిన్ఆంగ్ హ్లైయింగ్ అనే మియన్మార్ సైనిక నేతపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరింది.
శరణార్థుల స్థితిగతులు దిగజారినవే
బంగ్లాదేశ్‌లోని శరణార్థి క్యాంపుల్లో ఉపాధి, ఆదాయం లేవు.
శరణార్థులు ఉద్యోగాలు చేయలేరు. విద్య, వైద్యం కోసం క్యాంపు వెలుపలికి వెళ్లే అనుమతిలేదు. వాళ్లు స్వచ్ఛంద సంస్థల సాయం మీదే ఆధారపడుతున్నారు.
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించిన తర్వాత,యూఎస్ ఎయిడ్ అందించే నిధులను నిలిపివేసింది. దీని ప్రభావం తీవ్రంగా పడింది.
Details
పోషకాహార లోపం, మూసిన వైద్య కేంద్రాలు
2017 నుంచి పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతోంది. వైద్యం, ఆహారం, విద్యా సేవలపై ప్రభావం చూపింది. హ్యాండీకాప్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న క్లినిక్ మూసివేసినట్టు తెలుస్తోంది.
డబ్బుల లేమితో ప్రజలు చికిత్స పొందలేని పరిస్థితి. వైద్య కేంద్రాల మూతతో పాటు, గర్భిణులకు సేవలు అందడం తగ్గిపోయింది.
క్యాంప్ నాయకులు గతంలో లభించిన శీతాకాల దుస్తులు, రంజాన్ ప్రత్యేక భోజనాలు, ఆరోగ్య సామాగ్రి ఇప్పుడు అందడం లేదని తెలిపారు.
Details
నిధుల కొరత.. భవిష్యత్తుపై అనిశ్చితి
రోహింజ్యా శరణార్థుల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న డేవిడ్ బుగ్డెన్ ప్రకారం, నిధుల కొరత తీవ్ర సమస్యగా మారింది. 2023లో 91 కోట్ల డాలర్ల అవసరమైతే, కేవలం 57 కోట్ల డాలర్లు మాత్రమే అందాయి.
అమెరికా సహాయమందించడంపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. 2024లో అందిన 54.5 కోట్ల డాలర్లలో 30 కోట్ల డాలర్లు అమెరికా నుంచే వచ్చాయి.
భారత్ సహాయం పరిమితంగానే
భారతదేశం 2017లో ఆపరేషన్ ఇన్సానియత్ కింద కొంత సహాయ సామగ్రి పంపించింది.
2019లో మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో 250 గృహాలు నిర్మించింది. కానీ రోహింజ్యాలపై భారత సహాయం పరిమితంగానే ఉంది.
Details
మియన్మార్‌కు తిరిగి వెళ్లే అవకాశముందా?
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు 8 లక్షల మంది వివరాలను మియన్మార్‌కు పంపించినా, ఒక్కరు కూడా మళ్లీ వెనక్కి వెళ్లలేదు.
రఖైన్ రాష్ట్రంలో ఇంకా హింస కొనసాగుతుండటంతో వలసలను తిరస్కరించడం కష్టంగా మారింది.
రోహింజ్యాల చరిత్ర
రోహింజ్యాలు ముస్లిం తెగ. 2017లో వీరి జనాభా 10 లక్షలకు పైగా ఉండేది. వీరికి ప్రత్యేక సంస్కృతి, భాష ఉంది. కానీ మియన్మార్ ప్రభుత్వం వీరిని పౌరులుగా గుర్తించలేదు.
అక్రమ వలసదారులుగా చూడటం వల్ల హింస, నిర్బంధం ఎక్కువైంది. ప్రపంచం రోహింజ్యాల విషాదగాథపై కన్నేయాలి. వారు ఎదుర్కొంటున్న అన్యాయానికి సరైన పరిష్కారం కనుగొనాలి.
నిధుల కొరతతో సేవలు తగ్గడాన్ని నివారించి, శరణార్థులకు మౌలిక హక్కులు, అవసరాలు అందేలా చర్యలు తీసుకోవాలి.