
USA relations: భారత్-అమెరికా బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్ పీటర్ నవారో.. ఇంతకు ఆయన ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించారు. తరచూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాల ఆజ్యంపై 'పెట్రోల్' చిలకరిస్తున్నారు. గత అధ్యక్షులు నిర్మించడానికి చేసిన సహకార ప్రయత్నాలను బూడిదపాలు చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు, ట్రంప్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఈ భక్తుడు ఆగడం లేదు.. అతడి పేరు పీటర్ నవారో. గతంలో ట్రంప్ కోసం నాలుగు నెలల జైలులో గడిపి,శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఆయన, ట్రంప్ వాణిజ్యయుద్ధానికి వెనుక వ్యూహకర్త అనే ప్రచారం ఏర్పడింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక, 75 ఏళ్ల ఆర్థిక నిపుణుడు పీటర్ నవారోని తన వాణిజ్య సలహాదారుగా శ్వేతసౌధంలో తీసుకువచ్చారు.
వివరాలు
రిపబ్లికన్‌గా మారిన డెమోక్రట్..
ఆయన పూర్వనేపథ్యాన్ని తెలుసుకున్న కొందరు ఈ నియామకంపై ఆశ్చర్యపోయారు. 1970లలో నవారో జాతీయవాది కాదు, ఆయన ఓ డెమోక్రటిక్ సానుభూతిపరుడు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం కాలిఫోర్నియాలో ఉద్యమించారు. హార్వర్డు విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తరువాత శాన్ డియాగో మేయర్, కాంగ్రెస్ వంటి పదవుల కోసం పోటీ చేసి ఓడిపోయారు. యూజీఐలో ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 1990ల్లో ఆయన సంప్రదాయ జాతీయవాద వైఖరిగా మెల్లగా మారారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలను సమర్థించేవారు.
వివరాలు
వైట్‌హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్‌గా నవారో
2011లో "డెత్ బై చైనా" అనే పుస్తకం రాశారు,దానిని డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 2016లో ట్రంప్ అల్లుడు జరెడ్ కుష్నెర్ ద్వారా పరిచయం అయ్యారు. వైట్‌హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్‌గా మొదటి కార్యవర్గంలో పనిచేశారు. చైనాపై వాణిజ్యయుద్ధం, కొవిడ్ పాలసీ, 2020 ఎన్నికల తరువాత క్యాపిటల్ హిల్స్ ఘటనలో వారి ప్రమేయం ఉందంటారు. 2020 అల్లర్ల విషయంలో 2023లో ఆయన అమెరికా కాంగ్రెస్ విచారణకు హాజరు కాకపోవడంతో నాలుగు నెలల జైలు శిక్షను అనుభవించి, ట్రంప్ వీరభక్తుడిగా పేరు పొందారు.
వివరాలు
మస్క్‌తో ఘర్షణ
2024 ఎన్నికల సమయంలో ట్రంప్-ఎలాన్ మస్క్‌ల మధ్య స్నేహం పెరిగింది. మస్క్‌ను 'షాడో ప్రెసిడెంట్'గా కూడా కొందరు పిలిచారు. కానీ, నవారో సూచించిన రక్షణాత్మక వాణిజ్య వ్యూహాలు, టారిఫ్ యుద్ధాలు మస్క్‌కు నచ్చేది కాదు. విదేశాలలో తయారైన టెస్లా విడిభాగాలను అమెరికాలో అసెంబ్లింగ్ చేయడం పై నవారో కచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ సమక్షంలో మస్క్-నవారో తీవ్రంగా గొడవపడ్డారు. నవారో 'మూర్ఖుడు' అని బహిరంగ వ్యాఖ్యలు, తర్వాత మస్క్ శ్వేతసౌధం నుంచి దూరమయ్యారు. ఇదే నవారో ట్రంప్ కార్యవర్గంలో గొడవ పడిన మొదటి సందర్భం కాదు; 2018లో ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌తో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనంతరం క్షమాపణలు చెప్పారు.
వివరాలు
రెండోసారి అరాచకం
రెండోసారి ట్రంప్ కార్యవర్గంలో నియమితుడు కావడంతో, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం వెనక నవారోనే ఉన్నారు. భారత్‌పై ఆంక్షల విషయంలో కూడా ట్రంప్‌కి మద్దతుగా ఆయన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే భారత్ చమురు కొనుగోళ్లు నిలిచిపోవాల్సిందేనని వింతైన వాదన తెర పైకి తెచ్చారు. భారత్ కంటే ఎక్కువ చమురు చైనా, యూరోప్, ఇతర దేశాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ నవారో నోరు మెదపడం లేదు. రష్యా ఆంక్షల చమురును భారత్ మారు బేరానికి విక్రయించి లాభం పొందుతున్నట్లు చూపించడం వంటి చర్యలతో, పలు సంవత్సరాలుగా నిర్మించిన వ్యూహాత్మక భారత్-అమెరికా బంధాన్ని ఆయన విచ్చినం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.