
Nayara Energy: ట్రంప్ ప్రభావం.. భారత్ నుంచి చైనాకు డీజిల్ ఎగుమతి.. 2021 తర్వాత మొదటిసారి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భారత్-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మళ్లీ దగ్గర చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆయన ప్రభుత్వం పెనాల్టీలు, టారిఫ్‌లు విధించడంతో అంతర్జాతీయ ఇంధన వాణిజ్యంలో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో, యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు నయారా ఎనర్జీపై విధించిన ఆంక్షల తర్వాత, ఆ సంస్థ చైనాను ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఎంచుకుంది. 2021 తరువాత ఇదే మొదటిసారి నయారా ఎనర్జీ తన డీజిల్ సరుకు రవాణాను చైనాకు పంపింది అని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
వివరాలు
నయారా ఎనర్జీలో 49% వాటా రష్యా చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ సొంతం
నయారా ఎనర్జీలో 49% వాటా రష్యా చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ (Rosneft) సొంతం. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా, టెక్ రంగం దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఈ కంపెనీకి డేటా సేవలను నిలిపివేసింది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ (State Bank of India) కూడా ఆర్థిక సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాల నడుమ,"ఈఎం జెనిత్" (EM Zenith) అనే నయారా ఎనర్జీకి చెందిన నౌక, 4,96,000 బ్యారెళ్ల "అల్ట్రా లో సల్ఫర్ డీజిల్" (Ultra Low Sulfur Diesel) సరుకుతో జూలై 18న చైనాకు బయలుదేరింది. అసలు ప్రణాళిక ప్రకారం ఈ సరుకు మలేషియాకు వెళ్లాల్సి ఉండగా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో మార్గం మలక్కా జలసంధిలో మార్గం మళ్లించుకొంది.
వివరాలు
ఐరోపా సమాఖ్య అమల్లోకి తెచ్చిన 18వ ఆంక్షల ప్యాకేజీ
తాజా సమాచారం ప్రకారం, ఈ నౌక చైనాలోని జౌషాన్ (Zhoushan) పోర్టు వైపు కదులుతోందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఇటీవలి ఆంక్షల కారణంగా, నయారా ఎనర్జీ తన వ్యాపార భాగస్వాముల నుండి ముందస్తు చెల్లింపులు లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన యూరోపియన్ యూనియన్ 18వ ఆంక్షల ప్యాకేజీ వల్లే సంస్థకు ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ కొత్త ఆంక్షల్లో రష్యా నుంచి చమురు దిగుమతులకు పరిమితి విధించడం, ఒక్క బ్యారెల్ ధరను 47.6 అమెరికన్ డాలర్లలోపే ఉంచడం వంటి నిబంధనలు ఉన్నాయి.