Page Loader
RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన
మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన

RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద పెద్ద సమస్యగా మారింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని, నేరగాళ్లు కేవలం సొమ్ము కొల్లగొట్టడమే కాకుండా, దొంగతనంగా పొందిన ఆ సొమ్మును నకిలీ ఖాతాలకు బదిలీ చేస్తూ, వాటిని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, నిరక్షరాస్యులు, నిరుద్యోగులను దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి పలు పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో, వారు 'మ్యూల్‌ అకౌంట్ల'ను సృష్టించి, ఈ ఖాతాలలోకి మోసాలకు సంబంధించిన సొమ్మును తరలిస్తున్నారు. ఈ ఖాతాలు సులభంగా గుర్తించడం, సొమ్మును తిరిగి పొందడం కష్టతరమవుతోంది.

వివరాలు 

"జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్" పేరిట ఆర్‌బీఐ ఆధ్వర్యంలో హ్యాకథాన్‌

ఈ సైబర్ నేరాల నిరోధం కోసం, ఆర్‌ బి ఐ (RBI) "మ్యూల్ హంటర్.ఏఐ" (MuleHunter.AI) అనే ఏఐ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ద్వారా, బ్యాంకులు మ్యూల్ ఖాతాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోగలవు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ అంశాన్ని పంచుకున్నారు. సైబర్ నేరగాళ్లు, దోచుకున్న ఆర్థిక వనరులను మ్యూల్ ఖాతాల ద్వారా దాచుతున్నారని చెప్పారు. "జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్" పేరిట ఆర్‌బీఐ ఆధ్వర్యంలో హ్యాకథాన్‌ను నిర్వహించడం ద్వారా, ఈ నేరాలను నియంత్రించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయని వెల్లడించారు.

వివరాలు 

రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రయోగాత్మకంగా అమలు

ఈ మోడల్, ఏఐ,మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో పనిచేస్తుంది. దీని సాయంతో మ్యూల్ ఖాతాలను సమర్థంగా గుర్తించవచ్చని దాస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రెండు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఈ మోడల్‌కు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా జరిగాయని, మిగతా బ్యాంకులు కూడా ఈ ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి మ్యూల్ ఖాతాలను గుర్తించే విధానంపై పట్టు చేయాలని సూచించారు. ఆర్థిక మోసాలను అరికట్టడంలో బ్యాంకులు, ఇతర సంబంధిత భాగస్వామ్య సంస్థలతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటివి రాబోయే కాలంలో మరింతగా నిర్వహించబడతాయని, బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరచుకుని, లావాదేవీలపై పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.