
Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో పొందుపర్చించి నోటిఫై చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వివరాలు
దిల్లీకి వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్రమంత్రులను కలుస్తున్నా
''2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో విపరీతమైన విధ్వంసం జరిగింది. ఆ ప్రభావాల నుంచి రాష్ట్రాన్ని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది.మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని తిరిగి నిర్మించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రంగాల్లో కృషి ప్రారంభించాం.గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.1.20లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలుగా వదిలారు. ఈ ఏడాది మేము రాష్ట్రానికి గరిష్టంగా పెట్టుబడులు రప్పించగలిగాం," అని చంద్రబాబు వివరించారు.
ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం ఏడు మంది కేంద్రమంత్రులను కలుస్తున్నానని పేర్కొన్నారు.
వివరాలు
10 వేల కుటుంబాలకు సూర్యఘర్ పథకం
''సూర్యఘర్ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు ఈ పథకం ద్వారా విద్యుత్ అందించాలన్నది మా సంకల్పం. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం'' అని చెప్పారు.
''మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ కింద 72 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి కేంద్రం మద్దతు కావాలి. ఇందుకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ గారు సానుకూలంగా స్పందించారు," అని తెలిపారు.
వివరాలు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ..
రాజ్‌నాథ్ సింగ్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అభినందిస్తూ,రక్షణ రంగ అభివృద్ధికి ఏపీలో వివిధ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని కోరినట్టు వెల్లడించారు.
జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్: 6 వేల ఎకరాల భూమిలో మిసైల్, అమ్యూనిషన్ ప్రొటెక్షన్ కేంద్రం ఏర్పాటు.
లేపాక్షి-మడకశిర క్లస్టర్: మిలిటరీ, సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా అభివృద్ధి.
విశాఖ-అనకాపల్లి క్లస్టర్: నేవల్ ఎక్స్‌పెరిమెంట్ కేంద్రాల ఏర్పాటు.
కర్నూలు-ఓర్వకల్లు క్లస్టర్: మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ కాంపోనెంట్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి.
తిరుపతి IIT: DRDO సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు ప్రతిపాదన.
ఈ ప్రతిపాదనలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటుపై కూడా కేంద్రం పాజిటివ్‌గా పరిశీలన చేయనుందని చెప్పారు.
వివరాలు
కుసుమ్ పథకం కింద 2000 మెగావాట్లకు అనుమతి
కుసుమ్ పథకం కింద 2వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ రూపాంతరం చెందుతుందని, 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు
''పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని ఇతర ప్రాంతాలకు తరలించవచ్చు. ఇది ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. సముద్రంలో కలుస్తున్న నీటిని ఉపయోగించుకోవడమే లక్ష్యం. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టుకు నిధులకోసం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం," అని చంద్రబాబు వివరించారు.