
Andhra pradesh: వచ్చే ఏడాది నుండి అంగన్‌వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో ఆంగన్‌వాడీలతో సహా ఐదు రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు రకాల బడుల స్థానంలో ఐదు రకాల పాఠశాలలు ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీఓ-117ను రద్దు చేసి,దానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి పాఠశాల విద్యాశాఖ గురువారం మెమో జారీ చేసింది. ఉపాధ్యాయులు,విద్యార్థులు,వారి తల్లిదండ్రుల సూచనలు,సలహాలు తీసుకున్న తర్వాత కొత్త జీఓ విడుదల చేయనుంది. గత ప్రభుత్వం 4,731 ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయగా, ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేయనుంది.
వివరాలు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిర్ణయాలు
ఈ మార్పులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉంటాయి. బడులను ప్రాథమికంగా మార్చడం లేదా ఉన్నత స్థాయికి పెంచడం చేయనుంది. అంతేకాకుండా, ఇంటర్మీడియట్‌తో కలిసి ఉన్న హైస్కూల్ ప్లస్ వ్యవస్థను తొలగించనుంది. ఇక్కడి ఇంటర్మీడియట్ తరగతులను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగిస్తారు. 2021 డిసెంబరు 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంటారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐదు రకాల పాఠశాల విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానాలపై అవగాహన కల్పించేందుకు మండల, క్లస్టర్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
వివరాలు
పంచాయతీకో ఆదర్శ పాఠశాల:
ప్రతి గ్రామపంచాయతీ, వార్డు లేదా డివిజన్‌కు ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తారు. 1-5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒక బడిలో 120మంది విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడిని అదనంగా నియమిస్తారు. 150మందికి పైగా విద్యార్థులు ఉంటే, ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు. మండల,క్లస్టర్ స్థాయిల్లో మండల విద్యాధికారులు,క్లస్టర్ ప్రధానోపాధ్యాయులను కన్వీనర్లుగా నియమిస్తూ కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక పంచాయతీ లేదా వార్డులో ఎక్కువ ప్రాథమిక పాఠశాలలు ఉంటే,వీటి మధ్య ఉన్న పాఠశాలలను పాఠశాల యాజమాన్య కమిటీ సిఫారసుల మేరకు ఆదర్శ పాఠశాలగా మార్చుతారు. 3, 4, 5 తరగతులను ఆదర్శ పాఠశాలకు తరలిస్తారు.మౌలిక సదుపాయాలు లేని పాఠశాలల కోసం పీపీ-1, 2,ఒకటి,రెండు తరగతులను ఒకచోట,3,4,5 తరగతులను మరోచోట నిర్వహిస్తారు.
వివరాలు
ప్రాథమికోన్నత పాఠశాల మార్పులు:
ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు కలిపి 30మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే, ఆ పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా మార్చుతారు. వీటిలోని 6, 7, 8 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ 60మందికి పైగా విద్యార్థులు ఉంటే, వాటిని ఉన్నత పాఠశాలలుగా మారుస్తారు. 31-59 మంది విద్యార్థులుండే పాఠశాలల పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు.
వివరాలు
పాఠశాలల రకాలివీ..
అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తున్నారు. ఇందులో పూర్వ ప్రాథమిక విద్య-1,2 (ఎల్‌కేజీ, యూకేజీ) బోధన జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్య-1,2తోపాటు 1, 2 తరగతులను కలిపి నిర్వహించేవి ఫౌండేషనల్ పాఠశాలలు అవుతాయి. అలాగే, పూర్వ ప్రాథమిక విద్య-1,2తోపాటు 1-5 తరగతులు కలిపి బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగిస్తారు. గ్రామ పంచాయతీ, వార్డు, లేదా డివిజన్ స్థాయిలో పూర్వ ప్రాథమిక విద్య-1,2, 1-5 తరగతులతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటవుతాయి. 6-10 తరగతుల విద్య బోధన కొనసాగించేవి ఉన్నత పాఠశాలలుగా ఉంటాయి.
వివరాలు
ఉపాధ్యాయుల కేటాయింపు విధానం:
ఫౌండేషనల్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 30 మందిలోపు ఉంటే ఒక ఉపాధ్యాయుడిని, 31-60 మంది ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తారు. బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది వరకు ఉంటే ఒకరు, 21-60 మంది ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తారు. ఉన్నత పాఠశాలలో 76 మందికి మించిన విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడితో పాటు పీఈటీ పోస్టు ఉంటుంది. 76 మందికి తక్కువ ఉంటే సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌ను ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగిస్తారు. అవసరమైన సందర్భాల్లో మిగిలిన పీఈటీ పోస్టులను మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్, ఆర్ట్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లను నియమించబడతారు. ప్రతి ప్యానల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులు వారానికి కనీసం 8 తరగతులు బోధించాలి.