
Sugar mill: షుగర్ మిల్‌ను ముంచెత్తిన వరదలు..కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా హర్యానాలోని యమునానగర్ జిల్లాలో పలుచోట్ల వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యమునానగర్‌లో ఉన్న ప్రసిద్ధ సరస్వతి షుగర్ మిల్ ప్రాంగణానికి వరద నీరు చొచ్చుకురావడంతో, అక్కడ నిల్వచేసిన పంచదార కరిగిపోయింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ మిల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మిల్లులో భారీ ఆర్థిక నష్టం చోటుచేసుకుంది. సరస్వతి షుగర్ మిల్లులో ఉన్న గిడ్డంగిలో మొత్తం 2.20లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వ చేయబడింది. ఈ నిల్వ విలువ సుమారుగా రూ.97కోట్లు. అయితే, ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మిల్లు సమీపంలోని కాల్వ పొంగిపొర్లి మిల్ లోపలికి నీరు ప్రవేశించింది.
వివరాలు
రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకూ ఆస్తి నష్టం
ఈ విషయాన్ని మిల్లులో పనిచేస్తున్న సిబ్బంది అర్ధరాత్రి సమయంలో గుర్తించి వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం..''వర్షం తీవ్రమైన దశలోకి చేరిన తర్వాత కాల్వలో ఒక్కసారిగా నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆ కాల్వ ఆక్రమణకు గురవడం వల్లే ఈ స్థితి ఏర్పడింది. నీరు మిల్లులోకి ప్రవేశించిన వెంటనే వేలాది క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది. దానివల్ల రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకూ ఆస్తి నష్టం జరిగే అవకాశముంది. గిడ్డంగి మొత్తాన్ని పునఃపరిశీలించి,సమగ్రంగా నష్టాన్ని అంచనా వేస్తాం'' అని చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ ఈ మిల్లు వరద నీటికి గురి కాలేదని, ఇది మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
రానున్న ఆరు నుంచి ఏడు రోజుల వరకూ దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు
అయితే, మిల్లులో జరిగిన నష్టంతో స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని రాజీవ్ మిశ్రా స్పష్టం చేశారు. ఇక వాతావరణ విభాగం తాజా హెచ్చరికల ప్రకారం, రానున్న ఆరు నుంచి ఏడు రోజుల వరకూ దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వరదలు తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. భవనాలు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసుకుపోవడం లాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
వివరాలు
దేశ రాజధానిలో మోస్తరు వర్షాలు
ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. దేశ రాజధానిలో నిన్న ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే, చండీగఢ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశమంతా విస్తరించడం గమనార్హం.