
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ.. రేపు అఖిలపక్షసమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం దాడులకు దిగింది.
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం తీవ్రంగా దాడులు చేసింది.
ఈ చర్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. భారత సైన్యం నిర్వహించిన దాడుల వివరాలను రాష్ట్రపతికి ప్రధాని సమర్పించినట్లు సమాచారం.
వివరాలు
రేపు అఖిలపక్షసమావేశం
ఈ పరిణామాలపై రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ సమావేశంలో 'ఆపరేషన్ సిందూర్' అనంతర పరిస్థితులు, ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలను వివరిస్తారు.
జాతీయ భద్రతకు సంబంధించిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
వివరాలు
విపక్షాల స్పందన
భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడులకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి.
దేశ భద్రత విషయంలో ఏ నిర్ణయమైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని విపక్ష నేతలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసింది.
ఉగ్రదాడులపై స్పందన, కేంద్ర చర్యలపై కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వివరాలు
అత్యున్నత స్థాయి సమీక్షకు అమిత్ షా నాయకత్వం
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భేటీలో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
వివరాలు
ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు
'ఆపరేషన్ సిందూర్' లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఇందులో పాక్‌లో 4, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5 శిబిరాలపై దాడులు జరిపినట్లు సమాచారం.
ఇప్పటివరకు దాదాపు 80 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది.
బవహల్పూర్‌లోని జైషే మహమ్మద్ శిబిరం, మురిద్కేలోని లష్కరే తోయిబా క్యాంపుల్లో అత్యధికంగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.