Page Loader
Vegetable prices: కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే? 
కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే?

Vegetable prices: కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర అసమానతగా నమోదు కావడంతో, కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు,మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా ప్రధాన పంటల ధరలు పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం, రాజస్థాన్‌లో సాధారణం కంటే 118 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 57 శాతం, గుజరాత్‌లో 48 శాతం, హర్యానాలో 24 శాతం అధిక వర్షాలు పడినట్లు వెల్లడించింది. ఇది ఆయా ప్రాంతాల్లో పంటలకు అనుకూలంగా ఉన్నా, కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. కర్ణాటక (8 శాతం), పశ్చిమ బెంగాల్(4 శాతం), ఛత్తీస్‌గఢ్(3 శాతం)లో వర్షపాతం సగటుతో సమానంగా ఉండగా, బిహార్‌లో 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Details

ఆంధ్రప్రదేశ్ లో 15శాతం చొప్పున తక్కువ

తెలంగాణలో 22 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం, తమిళనాడులో 6 శాతం, మహారాష్ట్రలో 3 శాతం, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో తలో 2 శాతం చొప్పున తక్కువ వర్షాలు వచ్చాయి. వర్షపాతం విభిన్నంగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టానికి దారితీసే అవకాశం ఉండగా, దాని ప్రభావంగా ఆహారధాన్యాలు, ఇతర ప్రధాన పంటల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడొచ్చని హెచ్చరించింది. అయినా, ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేసే ప్రక్రియ అనుకూలంగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. సాధారణంగా లక్ష్యం 109.7 మిలియన్ హెక్టార్లు కాగా, జూలై 21 నాటికి 70.8 మిలియన్ హెక్టార్లలో విత్తనాలు వేసినట్టు తెలిపింది.

Details

దిగుబడులు ప్రభావితమై పెరిగే ఛాన్స్

గత ఏడాది ఇదే సమయానికి ఇది 68 మిలియన్ హెక్టార్లు కాగా, గత వారం 59.8 మిలియన్ హెక్టార్లు మాత్రమే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా జూలై 21 నాటికి మొత్తం వర్షపాతం 374 మిల్లీమీటర్లు నమోదైనట్టు తెలిపింది. ఇది దీర్ఘకాల సగటుతో పోలిస్తే 6 శాతం అధికంకాగా, గతవారం ఈ గణాంకం 9 శాతం అధికంగా ఉండేదని వివరించింది. అయితే మధ్యభారతం, ఈశాన్య భారతం వంటి ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల మొత్తంగా వర్షపాతం కొంత తగ్గినట్టు తెలుస్తోంది. ఖరీఫ్ సాగు ప్రస్తుతం సమగ్రంగా కొనసాగుతూనే ఉన్నా.. వర్షపాతం లోపం ఉన్న ప్రాంతాల్లో పంట దిగుబడులు ప్రభావితమై, తద్వారా సరఫరా సమస్యలు వచ్చి, ధరల పెరుగుదలకు దారితీసే అవకాశముందని ఐసీఐసీఐ నివేదికలో హెచ్చరించింది.