Page Loader
Dual Citizenship: ద్వంద్వ పౌరసత్వం భారత్‌లో చెల్లుతుందా.. చట్టాలు ఏం చెబుతున్నాయి?
ద్వంద్వ పౌరసత్వం భారత్‌లో చెల్లుతుందా.. చట్టాలు ఏం చెబుతున్నాయి?

Dual Citizenship: ద్వంద్వ పౌరసత్వం భారత్‌లో చెల్లుతుందా.. చట్టాలు ఏం చెబుతున్నాయి?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ మార్చి 24న అలహాబాద్ హైకోర్ట్ లఖ్‌నవూ బెంచ్‌లో జరిగింది. ఈ కేసులో సమాధానం ఇవ్వడానికి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇచ్చింది. ఏప్రిల్ 21 తర్వాతి వారంలో విచారణ కొనసాగుతుందని లఖ్‌నవూ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ ఏకే శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని విఘ్నేష్ శిశిర్ వాదన వినిపించారు.

వివరాలు 

పిటిషనర్ వాదనలు:

ఈ పిటిషన్‌పై 2024 నవంబర్‌లో విచారణ చేసిన న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై సంబంధిత మంత్రిత్వ శాఖ బ్రిటన్ ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు కోరుతూ లేఖ రాసిందని,ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టులో విచారణ సందర్భంగా, కేంద్రం మరికొంత సమయం కోరింది. దీంతో ఏప్రిల్ 21 తర్వాతి వారంలో ఈ కేసును జాబితాలో చేర్చనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్,రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నట్లు నిరూపించే పత్రాలు, బ్రిటన్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కలిగి లేరని,ఎంపీగా కొనసాగలేరని వాదిస్తున్నారు.

వివరాలు 

పిటిషనర్ వాదనలు:

అంతేకాక,ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. విఘ్నేష్ శిశిర్ ఇప్పటికే రెండు సార్లు కేంద్ర హోంశాఖకు మెమోరాండం సమర్పించి, రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరారు. కానీ, హోంశాఖ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పిటిషన్‌లో, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉండటం భారత న్యాయ చట్టాలు, పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం నేరమని పేర్కొన్నారు. అందుకే, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఇలాంటి పిటిషన్‌ను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా ఢిల్లీలో దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం, బ్రిటన్ అధికారులకు సమర్పించిన పత్రాల్లో రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నట్లు ఆరోపించారు.

వివరాలు 

ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే, దానిని ద్వంద్వ పౌరసత్వంగా పిలుస్తారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు, రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండే హక్కును పొందుతారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉండి, అమెరికా పౌరసత్వం కూడా పొందినట్లయితే, అతని వద్ద రెండు దేశాల పాస్‌పోర్టులు ఉంటాయి. ఈ విధంగా, ఆ వ్యక్తి రెండు దేశాల్లో ఓటు వెయ్యడమే కాకుండా, ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ హక్కులు పొందుతాడు. అంతేకాదు, వీసా లేకుండా ఆయా దేశాల్లో ప్రయాణించగలుగుతాడు.

వివరాలు 

భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనుమతించబడుతుందా?

భారత రాజ్యాంగం ప్రకారం, ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 9 ప్రకారం, భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది. పాస్‌పోర్ట్ చట్టం 1967 ప్రకారం, ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండడం నేరంగా పరిగణించబడుతుంది. విదేశాల్లో భారతీయులు ఇతర దేశ పౌరసత్వం పొందితే, తమ పాస్‌పోర్టును ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీకి అప్పగించి రద్దు చేయించుకోవాలి.

వివరాలు 

OCI స్కీమ్ అంటే ఏమిటి?

భారత విదేశాంగశాఖ ప్రకారం, ప్రవాస భారతీయుల కోరిక మేరకు 2005లో పౌరసత్వ చట్టాన్ని సవరించి, "ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా" (OCI) పథకాన్ని ప్రవేశపెట్టారు. 1950 జనవరి 26 నాటికి లేదా ఆ తర్వాత భారత పౌరులుగా ఉన్నవారు OCI కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా కొన్ని దేశాల పౌరులకు OCI ప్రయోజనాలు వర్తించవు.

వివరాలు 

OCI ద్వంద్వ పౌరసత్వమా?

OCI హోదా కలిగిన వారు భారత పౌరులుగా పరిగణించబడరు. వారికి భారతదేశ రాజకీయ హక్కులు ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదు. అందువల్ల, OCI ద్వంద్వ పౌరసత్వంగా పరిగణించలేమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా వెల్లడించింది.