LOADING...
Medaram: మహా జాతర కోసం మేడారం మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు 
మహా జాతర కోసం మేడారం మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు

Medaram: మహా జాతర కోసం మేడారం మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ములుగు జిల్లా మేడారంలో జరిగే ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రతి సంవత్సరం ఈ తల్లులను దర్శించడానికి వస్తున్న భక్తుల సంఖ్యఏటా పెరుగుతున్నది. దేశవిదేశాల నుంచి వచ్చే వారి కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. దీంతో మేడారంలో శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో,ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతున్న జాతర కోసం ఒకసారి నిధులు కేటాయించడం ఆ తర్వాత అవి కొన్నాళ్లకు పాడవటాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఇకపై శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం సంబంధిత అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

వివరాలు 

సంక్రాంతి సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యం

సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత ఈ పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే జనవరిలో జరిగే జాతర నాటికి శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించారు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలుమార్లు సమీక్షలతో, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ ఈ ప్రణాళికను పునరాలోచన చేశారు. త్వరలోనే సీఎం మేడారంలో పర్యటన చేసి మాస్టర్ ప్లాన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సంక్రాంతి సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యం. 2026లో జరగనున్న జాతర కోసం ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశారు.

వివరాలు 

టూరిజం సర్క్యూట్ అభివృద్ధి 

మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి అనే విధానం ఒకప్పుడు ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సాధారణ రోజుల్లో మూడు వేలకు పైగా, సెలవు రోజుల్లో పదివేలకు చేరువగా భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. రామప్ప, లక్నవరం, మేడారం ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయనున్నారు. గతంలో మహా జాతరకు నెలలు, కొన్ని సందర్భాల్లో రెండు నెలల ముందే పనులు ప్రారంభించేవారు. దాంతో నాణ్యతలో లోపాలు, కాంట్రాక్టర్లకు అత్యధిక చెల్లింపులు జరిగేవి. మాస్టర్ ప్లాన్ ద్వారా ఇప్పుడు ఈ విధానం మారనుంది. శాశ్వత పనుల కోసం అవసరమైన భూమిని సేకరించడం మొదలుపెట్టారు.

వివరాలు 

మహా జాతర తేదీలివే.. 

వచ్చే ఏడాది జనవరి 28-31 వరకు మహా జాతర జరగనుంది. జనవరి 28: సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరును నిర్వహిస్తారు. జనవరి 29: సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరతారు. జనవరి 30: భక్తులు పెద్దఎత్తున మొక్కులు చెల్లిస్తారు. జనవరి 31: అమ్మవారి వనప్రవేశంతో మహోత్సవం ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండువగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు పెద్ద ఎత్తున వస్తారు.

వివరాలు 

29 ఎకరాల్లో స్మృతివనం అభివృద్ధి 

మేడారం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తిచేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేయాలని నిర్ధారించారు. జంపన్నవాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా చెక్ డ్యామ్స్ నిర్మించాలని, అలాగే 29 ఎకరాల్లో స్మృతివనాన్ని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

ఎక్కడ.. ఏయే పనులు? 

మహా జాతర విజయవంతం చేయడానికి ట్రాఫిక్ నియంత్రణ,శాంతిభద్రతా పర్యవేక్షణ కీలకం. దీని కోసం రూ.14.50 కోట్లు కేటాయించారు.భూపాలపల్లి, హనుమకొండ, కాటారం, ఏటూరునాగారం మార్గాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించనున్నారు. ప్రధాన రహదారుల విస్తరణకు ఆర్ అండ్ బీ శాఖకు రూ.9.95 కోట్లు, మేడారం, పరిసర గ్రామాల్లో ప్రధాన, అంతర్గత మార్గాల విస్తరణకు పంచాయతీరాజ్ శాఖకు రూ.51.30 కోట్లు కేటాయించారు. నీటి వనరులు: డైరెక్ట్ పంపింగ్ ద్వారా శుద్ధ జలాలు అందించడంతో నీరు వృథా అవుతోంది; పాత ప్రాంతాలు బురదమయమయ్యాయి. ఈసారి ట్యాంకుల ద్వారా నీటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. రూ.5 కోట్లు మంజూరు చేశారు.

వివరాలు 

ఎక్కడ.. ఏయే పనులు? 

వ్యర్థాల నిర్వహణ: వందల యంత్రాలు, వేల కూలీలు, పనిముట్లు, రసాయనాలు సిద్ధం చేయాల్సి ఉంది. జాతర ఈసారి ఈకో-ఫ్రెండ్లీగా నిర్వహించబడుతుంది. జిల్లా పంచాయతీకి రూ.11.62 కోట్లు కేటాయించారు. అధికార విభాగాలకు: అగ్నిమాపక, గిరిజన సంక్షేమం, మత్స్య, సమాచార, పశు సంరక్షణ, వైద్యశాఖ, అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, ఎన్పీడీసీఎల్, ఆబ్కారీ, ఆర్టీసీలకు రూ.33.01 కోట్లు కేటాయించారు. జంపన్నవాగు పరిసరాల్లో పచ్చదనం పెంచడం, విశ్రాంతి వసతులు ఏర్పాటు చేయడం కోసం పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.