భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే 230కి పైగా మరణాలు, 900మందికి పైగా గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఇంతటి భారీ రైలు ప్రమాదం జరగలేదు.
భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.
ఇదే సమయంలో దేశ చరిత్రలో జరిగిన భారీ రైలు ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు
ఎక్కువ మంది చనిపోయింది భాగమతి నదిపై జరిగిన ప్రమాదంలోనే
జూన్ 6, 1981: దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం బిహార్‌లో జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పి భాగమతి నదిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో 750మంది చనిపోయారు. దేశంలోని రైలు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించిన ఘటన ఇదే.
డిసెంబర్ 23, 1964: తమిళనాడులో రామేశ్వరం తుపాను విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను కారణంగా పాంబన్ నుంచి ధనుష్కోడి మధ్య నడిచే ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 126మంది ప్రయాణికులు మరణించారు.
ఆగస్టు 20, 1995: ఫిరోజాబాద్ సమీపంలో ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ని పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 305 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రైలు ప్రమాదం
భారీ సంఖ్యలో జవాన్లను పొట్టన పెట్టుకున్న 'గైసల్' ప్రమాదం
26 నవంబర్ 1998: పంజాబ్‌లోని ఖన్నా వద్ద ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్‌కు చెందిన మూడు కోచ్‌లు పట్టాలు తప్పగా వాటిని జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది మరణించారు.
ఆగస్టు 2, 1999: పశ్చిమ బెంగాల్‌లోని గైసల్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 285 మందికి పైగా మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ను గైసల్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్టేషన్ నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలోని కతిహార్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
రైలు ప్రమాదం
బిహార్, బెంగాల్, యూపీల్లో ప్రమాదాలు ఇలా
సెప్టెంబర్ 9, 2002: బిహార్ రఫీగంజ్‌లోని ధావే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు నదిలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 140మందికి పైగా మరణించారు. అయితే ఈ రైలు పట్టాలు తప్పడం వెనుక మావోయిస్టుల హస్తం ఉందనే ప్రచారం జరిగింది.
మే 28, 2010: ముంబైకి వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడమే కాకుండా గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 145మంది ప్రయాణికులు చనిపోయారు. బెంగాల్‌లోని జార్‌గ్రామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
నవంబర్ 20, 2016: ఇండోర్-రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్‌లోని 14కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 152మంది మృతి చెందగా, 260మంది గాయపడ్డారు. కాన్పూర్‌కు సుమారు 60కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.