LOADING...
Shashi Tharoor: రాహుల్‌ గాంధీ ఆరోపణలకు శశి థరూర్‌ మద్దతు.. ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

Shashi Tharoor: రాహుల్‌ గాంధీ ఆరోపణలకు శశి థరూర్‌ మద్దతు.. ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ),కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల సమయంలో "భారీ స్థాయి నేరపూరిత మోసానికి" పాల్పడ్డారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు శశిథరూర్‌ స్పందిస్తూ కీలక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ లేవనెత్తిన అంశాలు అత్యంత తీవ్రమైనవేనని గుర్తుచేస్తూ, ఆయనకు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని థరూర్‌ సూచించారు. గడచిన కొంతకాలంగా కాంగ్రెస్‌ విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న శశి థరూర్‌ తాజాగా రాహుల్‌కు మద్దతు పలకడం గమనార్హం.

వివరాలు 

"ఓట్ల దోపిడీ విధానం"

ఇటీవల రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్‌ చేపట్టిన విశ్లేషణను గురువారం ఒక ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో "ఓట్ల దోపిడీ విధానం" కొనసాగిందని ఆయన ఆరోపించారు. ఆ ఆరోపణలకు నిదర్శనంగా 'మహాదేవపుర' నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రస్తావించారు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు చోరీకి గురైనట్లు తేలిందని రాహుల్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై శశి థరూర్‌ శుక్రవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

వివరాలు 

రాహుల్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి

"ఇవి అత్యంత తీవ్రమైన ప్రశ్నలు. అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ అనుమానాలను తప్పనిసరిగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్యం ఎంతో విలువైనది. నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా దాని విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. రాహుల్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై దేశ ప్రజలకు పూర్తి సమాచారం అందించాలి" అని థరూర్‌ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శశిథరూర్‌ చేసిన ట్వీట్  

వివరాలు 

మండిపడిన బీజేపీ 

మరోవైపు,రాహుల్‌ ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడంతో ఆ పార్టీ నిరాశ, ఆగ్రహానికి గురై కేంద్ర ఎన్నికల సంఘంపై ఈ తరహా ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడింది. ఇటీవలి కాలంలో శశి థరూర్‌, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం మధ్య విభేదాలు పెరిగిన సంగతి తెలిసిందే. తన సొంత పార్టీ సిద్ధాంతాలను ఆయన బహిరంగంగానే విమర్శించడం, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం వంటి చర్యలు కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ కారణంగా ఆయన పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారమూ వెలువడింది. ఇలాంటి పరిస్థితుల్లోనే థరూర్‌ తాజాగా రాహుల్‌ గాంధీకి మద్దతుగా చేసిన పోస్ట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.