
Yusuf Pathan : కేంద్రాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ పఠాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ప్రత్యేక దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం వివిధ దేశాలకు వెళ్లే బృందాలుగా ఎంపీలను పంపించేందుకు నిర్ణయించింది. అయితే ఈ బృందాల్లో సభ్యులను ఎంపిక చేసేందుకు ఆయా పార్టీలకు లేఖలు రాసినా, వారి ప్రతిపాదనలు రాకముందే కేంద్రం దౌత్య బృందాల ఏర్పాటుకు ముందుకెళ్లింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.శశిథరూర్ నేతృత్వంలో బృందాన్ని కేంద్రం ప్రకటించడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే కారణంతో అసంతృప్తిని వెలిబుచ్చింది.తమ అనుమతి లేకుండానే ఎంపీ యూసఫ్ పఠాన్‌ను దౌత్య బృందంలో చేర్చడాన్ని వ్యతిరేకించింది.
వివరాలు
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. భారత్ "ఆపరేషన్ సిందూర్"
ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. ఒక పార్టీకి చెందిన ఎంపీని విదేశీ బృందంలోకి ఎంపిక చేయాలంటే, ఆ పార్టీతో ముందుగా సంప్రదించాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని హెచ్చరించారు. తమ అభిప్రాయం తీసుకోకుండా యూసఫ్ పఠాన్‌ను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టారు. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన యూసఫ్ పఠాన్ ఆ దౌత్య బృందం నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా,పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్"ను ప్రారంభించింది. ఆపరేషన్‌లో హతమయ్యే ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైన్యం హాజరుకావడం పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలు
51 మంది ఎంపీలు.. విదేశాలకు
ఉగ్రవాద సంస్థలకు పాక్ మద్దతు ఇస్తోందని బహిరంగంగా ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ అసలైన వైఖరిని ప్రపంచదేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో ముస్లిం ఎంపీలు కూడా ఉండేలా ప్రత్యేకంగా కసరత్తు చేసింది. ఈ బృందాల్లో మొత్తం 51 మంది ఎంపీలు ఉండగా, వీరంతా విదేశాలకు పర్యటనలు చేయనున్నారు. ఈ పర్యటనల లక్ష్యం - పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇచ్చే మద్దతును అంతర్జాతీయంగా ఎత్తిచూపడం.