
UPI: రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వచ్చేనా? కేంద్రం ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తర్వాత టీ స్టాళ్ల నుంచి కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోటా ఆన్‌లైన్ పేమెంట్లు పెరిగాయి. ఈ పరిణామాలతో నగదు రహిత లావాదేవీలు విస్తృతంగా జరగుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని రోజులుగా రూ.2 వేలకుపైగా యూపీఐ (UPI) లావాదేవీలపై జీఎస్టీ (GST) విధించనున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనివల్ల వినియోగదారులలో అయోమయం, ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
Details
జీఎస్టీ విధించాల్సిన అవసరం లేదు
రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదన జీఎస్టీ కౌన్సిల్ వద్దకు రాలేదని మంత్రి స్పష్టం చేశారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి ఆలోచన లేదా పరిశీలన లేదని స్పష్టంగా తెలిపారు. కర్ణాటకలో కొన్ని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు అందిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణను జారీ చేసింది. ఈ ప్రకటనతో వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలు తీరినట్టయింది. ప్రస్తుతం యూపీఐ ద్వారా జరుగుతున్న లావాదేవీలపై జీఎస్టీ విధించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు స్పష్టమైంది.