AUS vs IND: కెప్టెన్ బుమ్రా సర్‌ప్రైజ్ ఫైనల్ XIలో.. అశ్విన్,నితీష్ రెడ్డి ఎంపిక : నివేదిక
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy 2024)భాగంగా మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు జస్‌ప్రీత్ బుమ్రా తీసుకోనున్నాడు. క్రికెట్ వర్గాలు చెప్పినట్లు, బుమ్రా తన టీమ్ ఎంపికపై ప్రత్యేకంగా ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పెర్త్ పిచ్ పేస్‌కి అనుకూలంగా ఉండడంతో,ఇలాంటి పిచ్‌పై కనీసం నలుగురు పేసర్లు ఉండాలని ప్రతి కెప్టెన్ కూడా కోరుకుంటాడు. ఒకే ఒక స్పిన్నర్‌ను జట్టులో పెట్టాలని,అతడు బ్యాటింగ్ కూడా చేయగలిగేలా చూడాలని ఉంటుంది. ప్రస్తుతం స్క్వాడ్‌లో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు,ఒక పేస్ ఆల్‌రౌండర్ ఉన్నారు,కావున ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే,బుమ్రా తన తుది జట్టుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అశ్విన్‌కు అవకాశమిచ్చే అవకాశం
విదేశీ పర్యటనలలో స్పిన్నర్‌ను ఎంచుకోవడంలో మొదటిగా బ్యాటింగ్ చేయగలిగే రవీంద్ర జడేజాను ప్రాధాన్యం ఇచ్చేలా ఉంటారు. అయితే, ఈసారి ఆసీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను ఏకైక స్పిన్నర్‌గా తీసుకోవాలని బుమ్రా భావిస్తున్నాడని సమాచారం. దీంతో జడేజా,వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం తగ్గే అవకాశం ఉంది. అశ్విన్ బౌన్సీ పిచ్‌లపై మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉన్న కారణంగా, కెప్టెన్ బుమ్రా ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది.
నితీశ్ అరంగేట్రం.. సర్ఫరాజ్‌కు అవకాశం?
తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా అతడికి స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా Aతో పాటు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లలో నితీశ్ మెరుగైన ప్రదర్శన చేశాడని మేనేజ్‌మెంట్ గమనించిందని సమాచారం. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే సత్తా కూడా నితీశ్‌కు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో యశ్ దయాళ్, హర్షిత్ రాణాకు ఇప్పట్లో అవకాశం రాకపోవచ్చు. పేస్ బౌలింగ్ బాధ్యతలు బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ మధ్య పంచుకుంటారని అంచనా. మేనేజ్‌మెంట్ లోతైన బ్యాటింగ్‌తోపాటు ఫాస్ట్ బౌలింగ్ బలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
ఓపెనర్‌గా కేఎల్ రాహుల్..?
రోహిత్ శర్మ లేకపోవడంతో, కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది . సీనియర్ ప్లేయర్‌గా కేఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో, అభిమన్యూ అవకాశాన్ని కోల్పోవచ్చు. వన్‌డౌన్‌లో గిల్ స్థానంలో సర్ఫరాజ్‌కు అవకాశం ఇవ్వబడే అవకాశముంది. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉండేలా ఉంటాడు. ధ్రువ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయాలు ఏవైనా ఉంటే, తదితర వివరాలపై క్లారిటీ కోసం రెండు రోజులు వేచి చూడాల్సిందే. తుది జట్టు (అంచనా) యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్)