LOADING...
Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!
ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!

Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకర ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, ప్రాణాలు విలువైనవని, ఉత్సవాల కన్నా ప్రజల భద్రతే ముఖ్యమని చెప్పారు. క్రీడా విజయాలను జరుపుకోవడంలో రోడ్ షోల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

సంబరాలను స్టేడియంలో కూడా నిర్వహించుకోవచ్చు: గంభీర్ 

ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ సందర్భంగా ముంబైలో భారత కెప్టెన్ శుభమన్ గిల్‌తో కలిసి గౌతమ్ గంభీర్‌, మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి స్పందించారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో పాల్గొన్న అభిమానుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఓ విలేకరి ప్రశ్నించగా,గంభీర్ స్పందిస్తూ.. "ప్రజల ప్రాణాలే అత్యంత ప్రాధాన్యత కావాలి. ఇదే విషయాన్ని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. రోడ్ షోలు నిర్వహించే ముందు దానిపై అవగాహన ఉండాలి. సంబరాలను స్టేడియంలో కూడా నిర్వహించుకోవచ్చు.ఈ సంఘటన చాలా దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడని ఆకాంక్షిస్తున్నాను. ఇకపై మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి రోడ్ షోలకు తావు ఇవ్వకూడదు" అని అన్నారు.

వివరాలు 

తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం 

బెంగళూరులో జరిగిన ఈ తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కల యువకులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో ఆరుగురు, వైదేహి ఆసుపత్రిలో నలుగురు, మణిపాల్ ఆసుపత్రిలో మరొకరు మరణించారు. ఐపీఎల్‌లో 18 ఏళ్ల అనంతరం ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడంతో, చిన్నస్వామి స్టేడియం వద్దకి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అంచనాలకు మించి దాదాపు 2.5 లక్షల మంది అక్కడికి రావడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇదే సమయంలో అకాల వర్షం పడటంతో పరిస్థితి మరింత సంక్లిష్టమై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు.