
Mohammad Kaif: మిగిలిన అందరికి కన్నా గంభీర్ మీదే తీవ్ర ఒత్తిడి: మహ్మద్ కైఫ్
ఈ వార్తాకథనం ఏంటి
సచిన్ టెండూల్కర్-జేమ్స్ అండర్సన్ ట్రోఫీ సందర్భంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లను గెలుచుకోగా,ఒక మ్యాచ్ డ్రా అయింది.అయితే ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ మీదే అత్యధిక ఒత్తిడి ఉండిందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కైఫ్ తెలిపిన వివరాల ప్రకారం,ఈసిరీస్‌కు ముందు భారత్ టెస్టుల్లో తక్కువ స్థాయి ప్రదర్శనకే పరిమితమైందని గుర్తుచేశాడు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం,ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిరుత్సాహపరిచే ప్రదర్శన కారణంగా,ఇంగ్లాండ్‌తో సిరీస్ కూడా కోల్పోతే గంభీర్ కోచ్‌గా తన స్థానాన్ని కోల్పోయేవాడని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారని కైఫ్ వివరించాడు.
వివరాలు
గంభీర్ తట్టుకుని నిలిచాడు. అతడిని ఎంత పొగిడినా తక్కువే: కైఫ్
ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, ''ఈ టూర్‌లో గంభీర్ మీదనే అత్యధిక ఒత్తిడి ఉంది. ఓవల్ టెస్ట్ మ్యాచులో టీమ్‌ఇండియా ఓడిపోయి ఉంటే, సోషల్ మీడియా మీద అతనిపై తీవ్ర వ్యతిరేకతతో విరుచుకుపడేవారు. మీమ్స్ రూపంలో తీవ్ర విమర్శలు వచ్చేవి. బహుశా ఇది అతడి కోచ్‌గా చివరి టెస్టే అయ్యేవచ్చునేమో. కానీ అది జరుగలేదు. గంభీర్ తట్టుకుని నిలిచాడు. అతడిని ఎంత పొగిడినా తక్కువే'' అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.
వివరాలు
బ్యాటింగ్ డెప్త్‌పై దృష్టి పెట్టిన గంభీర్
అంతేకాదు, గంభీర్ కోచ్‌గా తీసుకున్న కీలక నిర్ణయాలపై కూడా కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ''జస్ప్రిత్ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో చాలామంది కుల్‌దీప్ యాదవ్‌ను ఆడించాలని కోరారు.కానీ గంభీర్ మాత్రం బ్యాటింగ్ డెప్త్‌పై దృష్టి పెట్టాడు. ఎనిమిదో స్థానానికి వరకు బ్యాటర్లు ఉండాలని అతను భావించాడు. ఆ ఆలోచన చాలా సరైనదిగా నిరూపితమైంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. ఇదే కారణంగా భారత జట్టు పెద్ద స్కోర్లు చేయగలిగింది. బ్యాటింగ్ డెప్త్ వల్లే సిరీస్‌ను డ్రా చేయగలిగింది. యువ ఆటగాళ్లతో నిండి ఉన్న ప్రస్తుత భారత జట్టును కోచ్‌గా ముందుకు తీసుకెళ్లడంలో గంభీర్‌పై ఎంత పెద్ద బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు,'' అని కైఫ్ పేర్కొన్నాడు.