
Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుకకు పిసిబి గైర్హాజరు.. ఐసిసి వివరణ..తిరస్కరించిన పీసీబీ
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.
దీంతో, అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న జట్టుగా భారత జట్టు రికార్డు నెలకొల్పింది.
అయితే, ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెజెంటేషన్ సెర్మనీలో ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ నుంచి ఎవ్వరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
వివరాలు
మొహ్సిన్ నఖ్వీకి అనారోగ్యం
ఈ ఘటనపై పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ సహా పలువురు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదని చెబుతున్నారు.అయితే, PCB CEO సుమైర్ అహ్మద్, ఉస్మాన్ వాహ్లా ఇద్దరూ దుబాయ్‌లోనే ఉన్నప్పటికీ, కనీసం వారిలో ఒక్కరు కూడా వేదికపై కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కావాలనే ఐసీసీ పాక్ అధికారులను అప్రతిష్టపాలు చేసిందా?లేక పాక్ అధికారులు స్వయంగా హాజరుకాలేదా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముగింపు వేడుకల్లో, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్లు, మ్యాచ్ అధికారులకు మెడల్స్ అందించగా,ఐసీసీ చైర్మన్ జయ్ షా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీని అందజేశాడు.
వివరాలు
పీసీబీ నిరసన
వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ రోజర్ ట్వోస్ కూడా వేదికపై పాల్గొన్నారు.
ముగింపు వేడుకల్లో PCB CEO, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్‌ను పక్కన పెట్టడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఐసీసీ కారణం వెల్లడించినప్పటికీ, PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అసంతృప్తిగా ఉన్నట్లు PCB వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి, ముగింపు వేడుకల్లో PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వేదికపై ఉండేలా ఐసీసీ తొలుత ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
కానీ, ఆయన హాజరు కాలేకపోవడంతో ఐసీసీ తన ప్రణాళికలను మార్చుకున్నట్లు PCB వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
పాక్‌ను పట్టించుకోకుండా ఐసీసీ అనేక తప్పిదాలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్‌ను పట్టించుకోకుండా ఐసీసీ అనేక తప్పిదాలు చేసిందని PCB అభిప్రాయపడుతోంది.
భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోగో మార్చడం, లాహోర్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేయడం వంటి సంఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనబడ్డాయి.
ట్రోఫీ ప్రదానం సమయంలో ప్లేజాబితాలో పొరపాటుతో భారత జాతీయ గీతాన్ని కొన్ని సెకన్లు ప్లే చేసినట్లు ఐసీసీ తెలిపింది.
ఈ లోపాన్ని వెంటనే సరిచేసినప్పటికీ, ఈ వ్యవహారంపై వివాదాలు కొనసాగుతున్నాయి.