Jasprit Bumrah: "జస్ప్రీత్ బుమ్రా గురించే భారత్‌కు ఆందోళన": ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ కోచ్ ఆకిబ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నాయి.
ఇంగ్లండ్‌తో మూడో వన్డే నాటికి అతను జట్టుతో చేరుతాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవనున్న నేపథ్యంలో బుమ్రా భారత్‌కు అత్యంత కీలక ఆటగాడిగా కనిపిస్తున్నాడు.
ఈ టోర్నమెంట్‌లో టీమ్‌ఇండియా పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కూడిన గ్రూప్‌లో పోటీపడనుంది.
ఈ సందర్భంగా పాక్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ప్రతి జట్టును తేలిగ్గా తీసుకోకూడదు
''బుమ్రా ఫిట్‌నెస్ విషయమై భారత్ కొంత ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టునైనా తేలిగ్గా తీసుకోవడం సమంజసం కాదు. అత్యుత్తమ ఎనిమిది జట్లు ఇందులో పోటీపడుతున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా వంటి బౌలర్ జట్టులో ఉంటే అది వారికే ప్లస్ పాయింట్. అయితే, అతడిని ఎదుర్కొనేందుకు మేము ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం లేదు,'' అని ఆకిబ్ పేర్కొన్నారు.
వివరాలు
అదే మంచి ఎంపిక..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టుపై మాజీల నుంచి వచ్చిన విమర్శలను ఆకిబ్ ఖండించారు.
''కేవలం రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా జట్టులో మార్పులు చేశామని అనడం సరైంది కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మేము ముందుగా నిర్ణయించిన జట్టునే ఎంపిక చేశాం. గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. ఫహీమ్, ఖుష్దిల్‌ల ఎంపిక మంచి నిర్ణయం. ఉపఖండ పిచ్‌లపై వారు రాణిస్తారనే నమ్మకం ఉంది,'' అని ఆకిబ్ స్పష్టం చేశారు.