LOADING...
Pak-Saudi Deal: 'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'.. భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్, సౌదీ అరేబియా 
'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'..

Pak-Saudi Deal: 'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'.. భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్, సౌదీ అరేబియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ ఇటీవల దాడి జరిపిన కొద్ది రోజులకే ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల్లో ఏదో ఒకదాని మీద దాడి జరిగినట్లయితే, దానిని రెండింటి పైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా సంయుక్తంగా శత్రువుతో తలపడతాయి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసి, అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాకు పర్యటనకు వెళ్లారని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

ఖతార్-అమెరికాల మధ్య మరింత మెరుగైన రక్షణ సహకార ఒప్పందం ఖరారు

ఈఒప్పందం లక్ష్యం రెండుదేశాల రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలపరచడం, అలాగే ఏ విధమైన దాడి ఎదురైనా దానికి కలిసికట్టుగా ప్రతిస్పందించడం అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక దేశంపై జరిగిన దాడిని ఇరు దేశాలపై జరిగినదిగానే పరిగణిస్తారని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్"చేపట్టిన విషయం తెలిసిందే. ఈపరిణామాల తర్వాత సౌదీ-పాక్‌ల మధ్య ఇలాంటి ఒప్పందం కుదరడం విశేషంగా భావించబడుతోంది. ఇదిలావుండగా ఖతార్-అమెరికాల మధ్య మరింత మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు.