
Indians in foreign jails: విదేశీ జైళ్లలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో విధించనున్న మరణశిక్ష కారణంగా విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. లోక్‌సభలో అందించిన తాజా వివరాల ప్రకారం మార్చి 2025 వరకు విదేశీ జైళ్లలో వేలాదిగా భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో మొత్తం 10,152 మంది భారతీయులు వివిధ జైళ్లలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ జైళ్లలో 10,152 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, వీరిలో అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,633 మంది,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2,518 మంది,నేపాల్‌లో 1,317 మంది ఉన్నట్లు తెలిపింది.
వివరాలు
ఎనిమిది దేశాల్లో 49 మంది భారతీయులకు మరణశిక్ష
ఖతార్‌లో 611 మంది, కువైట్‌లో 387 మంది, మలేషియాలో 338 మంది, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 288 మంది, పాకిస్థాన్‌లో 266 మంది, చైనా జైళ్లలో 173 మంది, అమెరికాలో 169 మంది ఉన్నట్లు పేర్కొంది. 2025 మార్చి నాటికి ఎనిమిది దేశాల్లో 49 మంది భారతీయులు మరణశిక్ష ఎదుర్కొంటున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈలో 25 మంది, సౌదీ అరేబియాలో 11 మంది, మలేషియాలో ఆరుగురు, అలాగే కువైట్, ఇండోనేషియా, ఖతార్, అమెరికా, యెమెన్‌ల్లో మిగిలిన వ్యక్తులు ఉన్నారని వివరించారు. విదేశీ కోర్టులు శిక్ష విధించిన తర్వాత సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ కార్యాలయాలు వారికి అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
వివరాలు
ఇతర దేశాల్లో నిర్బంధంలో 307 మంది భారతీయ మత్స్యకారులు
అలాగే ఇతర దేశాల్లో 307 మంది భారతీయ మత్స్యకారులు నిర్బంధంలో ఉన్నారని వివరించారు. వీరిలో పాకిస్తాన్‌లో 217 మంది, శ్రీలంకలో 58 మంది, సౌదీ అరేబియాలో 28 మంది, బహ్రెయిన్‌లో నలుగురు ఉన్నారని తెలిపారు. 2024 సంవత్సరంలో శ్రీలంక 479 మంది భారతీయ జాలర్లను విడుదల చేయగా, బంగ్లాదేశ్ 95 మందిని విడుదల చేసిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులకు న్యాయసాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి కానీ, ఇటీవలి మరణశిక్ష అంశంతో కుటుంబాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.