Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
48 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆమె బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీనివల్ల ఢిల్లీకి మరోసారి ఒక మహిళా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు.
రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు, రెండు సార్లు ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యక్షురాలిగా ఎన్నికైన చరిత్ర ఉంది.
పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై, ఆపై మేయర్‌గా సేవలందించారు.
భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో,ముఖ్యమంత్రి పదవికి రేఖా గుప్తా పేరును ఖరారు చేయడంతో పాటు, ప్రవేశ్ వర్మను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.
అంతేగాక, విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వివరాలు
రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం
రేఖా గుప్తాకు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పనిచేసిన అనుభవం లేకపోయినా, రాజకీయంగా ఆమెకున్న విస్తృత అనుభవమే ఈ నిర్ణయానికి దారితీసింది.
విద్యార్థి నాయకురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా, పీతంపురా, షాలీమార్ బాగ్ ప్రాంతాల్లో ప్రజలకు సుపరిచితురాలు.
ఈ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆమె ఎంతో కృషి చేశారు.
వారి కుటుంబానికి సంఘ్ (RSS) నేపథ్యం ఉండటంతో రాజకీయంగా మరింత బలమైన స్థితిని ఏర్పరుచుకున్నారు.
విద్యార్థి దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పని చేసిన ఆమె, ఆ తర్వాత బీజేపీలో చేరారు.
వివరాలు
ప్రజా సేవలో రేఖా గుప్తా
2007లో ఉత్తర పీతంపురా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన రేఖా గుప్తా, ఆపై షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా సేవలందించారు.
ఆమె ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా గుర్తింపు పొందారు.
ఢిల్లీలో బీజేపీ గొంతును గట్టిగా వినిపించే నాయకుల్లో ఆమె ఒకరు.
షాలీమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందనా కుమారి చేతిలో ఓటమిని చవిచూశారు.
అయితే, 2025లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 29,000కి పైగా ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు.
రేఖా గుప్తా బీజేపీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
వివరాలు
రేఖా గుప్తా వ్యక్తిగత జీవితం
పదవులు లేకున్నా ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేలా చేసింది.
రేఖా గుప్తా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలో జన్మించారు.ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.
1976లో కుటుంబం ఢిల్లీకి మారింది. అక్కడే ప్రాథమిక విద్యనుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు.
విద్యార్థిగా ఉండగానే RSS అనుబంధ సంస్థ ABVPలో చేరారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో, దౌలత్ రామ్ కాలేజీలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
1995-96లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షురాలిగా ఎన్నికై, విద్యార్థుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
వివరాలు
రేపు ప్రమాణ స్వీకారోత్సవం
చదువు పూర్తైన తర్వాత 2003-04లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ విభాగంలో చేరి కార్యదర్శిగా పని చేశారు.
2004-06 మధ్య భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా, ఈ వేడుకను ఫిబ్రవరి 20న ఢిల్లీలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులను ఆహ్వానించారు.
వీరిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, నాగాలాండ్ సహా అనేక రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.
వివరాలు
మూడో వేదికపై సంగీత కార్యక్రమం
ఈ వేడుకలో మూడు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రివర్గ సభ్యులు పాల్గొంటారు.
మరో వేదికపై ప్రత్యేక అతిథులు కూర్చొననుండగా, మూడో వేదికపై సంగీత కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం.