
CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.
శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనడం కోసం ఆయన ఈ పర్యటన చేపట్టారు.
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు.
ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో, 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, మధ్యాహ్నం 12 గంటలకు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు.
వివరాలు
వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్న చంద్రబాబు
అదే రోజు ఒంటి గంటకు శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలవనున్నారు.
ఈ భేటీల్లో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, జల్ జీవన్ మిషన్ అమలులో సహకారం, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి కేంద్రం నుంచి మరింత సహాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, క్రిమినల్ చట్టాల అమలుపై చంద్రబాబు చర్చించనున్నారు.
వివరాలు
తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుకు స్వాగతం
అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం నుండి అవసరమైన సహకారం అందించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు.
సాగునీరు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం తగిన నిధులు, అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించనున్నారు.
పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు.
న్యూఢిల్లీకి చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.
వివరాలు
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు
భారత్ మండపంలో శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.
ఈ సమావేశం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు,అడ్మినిస్ట్రేటర్లు హాజరవుతారు.
ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఈ సమావేశంలో 'వికసిత్ భారత్.. 2047' లక్ష్యంతో విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి.
పారిశ్రామిక అభివృద్ధి,యువత నైపుణ్యాభివృద్ధి,ఉపాధి సృష్టి,ద్వితీయ,తృతీయ శ్రేణి పట్టణాల్లో తయారీ,సేవా రంగాల ప్రోత్సాహం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, హరిత ఇంధనం, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించనున్నారు.