Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం 'మహాయుతి' ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇది ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మూడోసారి. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు.
కార్యక్రమానికి 19 మంది ముఖ్యమంత్రులు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్‌లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.