
#NewsBytesExplainer: నిమిష ప్రియ కేసు కంటే ముందు.. బ్లడ్ మనీ ఇంతక ముందు ఏ భారతీయుడినైనా కాపాడిందా..?
ఈ వార్తాకథనం ఏంటి
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఈ శిక్ష నుండి విముక్తి పొందే ఏకైక మార్గం 'బ్లడ్‌మనీ' చెల్లించడమే. అంటే, బాధితుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి క్షమాభిక్ష పొందడమే మార్గం. నష్టపరిహారం తీసుకోవడానికి ఆ కుటుంబం ఒప్పుకుంటేనే ఆమె శిక్ష నుంచి బయటపడే అవకాశముంది. అందుకే ప్రస్తుతం ఈ 'క్షమాధనం' అనే బ్లడ్‌మనీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకుముందు కూడా బ్లడ్‌మనీ ద్వారా మరణశిక్ష నుండి విముక్తి పొందినవారున్నారా?
వివరాలు
బ్లడ్‌మనీ రూపంలో నష్టపరిహారం
ఇస్లామిక్ దేశాలలో అమలులో ఉన్న షరియా చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా బాధిత కుటుంబం నేరస్తుడిని క్షమిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇందుకోసం బ్లడ్‌మనీ రూపంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రస్తుతం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి దేశాలలో అమలులో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన సందర్భాల్లో కొంతమంది భారతీయులు బ్లడ్‌మనీ ద్వారా మరణశిక్ష నుంచి బయటపడిన సందర్భాలున్నాయి. వారెవరు? ఆ కేసులు ఏమిటో చూద్దాం.
#1
ఏఎస్ శంకరనారాయణ కేసు:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బంగ్లాదేశీ కార్మికుడిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు మరణశిక్ష పడింది. అయితే, బాధిత కుటుంబం 2 లక్షల దిర్హామ్‌ల బ్లడ్‌మనీ (ప్రస్తుతం దాదాపు రూ.47 లక్షలు) చెల్లిస్తే క్షమించనున్నట్లు చెప్పింది. దాతల సహాయంతో ఈ మొత్తం చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలులో నుంచి విడుదలయ్యాడు.
#2
లింబాద్రి కేసు:
2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్‌మనీ చెల్లించి మరణశిక్ష నుంచి బయటపడ్డాడు. అతని తరఫున ఓ సౌదీ దాత బాధిత కుటుంబానికి రూ.1.8 కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. దీనితో అతను శిక్ష నుంచి విముక్తి పొంది స్వదేశానికి చేరుకున్నాడు. 3. ముగ్గురు భారతీయుల కేసు (2014): 2014లో సౌదీలో ముగ్గురు భారతీయులు మరణశిక్షను ఎదుర్కొంటుండగా బాధిత కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించి వారు కూడా శిక్ష నుంచి తప్పించుకున్నారు.
#4
సలీమ్ భాషా కేసు:
కర్ణాటకకు చెందిన బెంగళూరులోని ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీలో 9 మందిని రోడ్డు ప్రమాదంలో చంపిన కారణంగా మరణశిక్ష విధించారు. అతడిని రక్షించేందుకు భారత్ నుంచి పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. చివరకు సౌదీ రాజు అబ్దుల్లా స్వయంగా ముందుకొచ్చి దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ చెల్లించడంతో 2013లో సలీమ్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు.
#5
అబ్దుల్ రహీమ్ కేసు:
2006లో కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ రియాద్‌లో తన యజమాని కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. బాలుడి కుటుంబం రూ.34 కోట్ల బ్లడ్‌మనీ తీసుకునేందుకు అంగీకరించడంతో అతనికి మరణశిక్ష తప్పింది. ఈ భారీ మొత్తాన్ని మలయాళీ ప్రవాసులు ఫండ్‌రైజింగ్ ద్వారా సేకరించి చెల్లించారు. అయితే మరణశిక్ష తప్పినప్పటికీ అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో రహీమ్ శిక్షా కాలం ముగియనుంది.
#6
మహ్మద్ మీర్జా కేసు:
2019లో దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన మహ్మద్ మీర్జా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ బ్లడ్‌మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (తప్పుడు కాలంలో దాదాపు రూ.11 కోట్లు) చెల్లించాడు.
వివరాలు
ప్రస్తుతం నిమిష ప్రియ పరిస్థితి:
నిమిషా ప్రియా కేసులో కూడా ఇప్పుడు బ్లడ్‌మనీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లి బ్లడ్‌మనీ చెల్లించి తన కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించారు. ప్రియ కుటుంబం బాధిత కుటుంబానికి 1 మిలియన్ డాలర్లు (రూ.8.6 కోట్లు) చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. కానీ బాధిత కుటుంబం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదట. ప్రస్తుతం నిమిష తరఫు న్యాయవాదులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమెను శిక్ష నుండి విడిపించగలరా లేకపోతే శిక్ష అమలు అవుతుందా అన్నది చూడాల్సిన విషయం.