
Heat Waves: దేశంలో వడగాలుల పంజా.. IMD హెచ్చరికలు, తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు ధాటిగా వీయనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర,మధ్య భారతదేశం వడగాలుల ప్రభావానికి గురికానుందని తెలిపింది.
ఈ ప్రభావిత ప్రాంతాల్లో దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లో యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లోని కొంత భాగాల్లో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD వెల్లడించింది.
వడగాలుల కారణంగా వాతావరణ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగవచ్చని హెచ్చరించింది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
వివరాలు
తెలంగాణకు అప్రమత్తత
దక్షిణాది రాష్ట్రాల్లో పిడుగులు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు నమోదు కావచ్చని అంచనా వేసింది.
ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ పిడుగుల హెచ్చరికలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్,కుమురం భీం,నిజామాబాద్,మంచిర్యాల,నిర్మల్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దీనితోపాటు మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఈ వడగాలుల కారణంగా తీవ్ర ఎండలు పెరిగే అవకాశముందని పేర్కొంది.
సాధారణ స్థాయిని మించి 2 నుండి 3 డిగ్రీలవరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యంగా రాత్రిపూట కూడా వాతావరణం ఉష్ణంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
వివరాలు
వర్షాలు కురిసే అవకాశం
ఇక రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
శుక్రవారం, శనివారం రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వెల్లడించింది.
గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.