Paris AI Summit: ప్రధాని మోదీ సహ అధ్యక్షత వహించే పారిస్ AI యాక్షన్ సమ్మిట్ లక్ష్యం ఏంటి ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది.
అగ్రదేశాలు, ప్రముఖ సంస్థలు ఈ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
రేపటి నుంచి ప్రారంభమయ్యే "పారిస్ AI సమ్మిట్" లో ప్రపంచ నాయకులు, ఇండస్ట్రీ నిపుణులు కలిసి AI భవిష్యత్తు గురించి చర్చించనున్నారు.
దీనిని "పారిస్ AI యాక్షన్ సమ్మిట్" అని కూడా పిలుస్తారు. AI అభివృద్ధి ఊహించని స్థాయిలో జరుగుతుండటంతో, దాని ముప్పులను తగ్గిస్తూ, ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యంగా ఉంది.
2025 ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. దీనిని ఫ్రాన్స్ నిర్వహిస్తుండగా, భారత్ కో-ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తోంది.
వివరాలు
సమ్మిట్ కీలక విషయాలు:
ఈ రెండు రోజుల సదస్సుకు వివిధ దేశాల ఉన్నతాధికారులు,వ్యాపార ప్రముఖులు హాజరవుతారు.
ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పాల్గొననున్నారు.
అదనంగా, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా హాజరవుతారు, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి అంతర్జాతీయ పర్యటన.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సదస్సుకు ప్రత్యేక రాయబారిని పంపనున్నారు.
ఈ కార్యక్రమం పారిస్‌లోని గ్రాండ్ పలైస్ వేదికగా జరుగనుంది.
వివరాలు
ఈ సమ్మిట్ ఎందుకు ముఖ్యం?:
ఇందులో ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, అధికారిక విందు, అలాగే చివరి రోజు ప్రపంచ నాయకులు, కార్పొరేట్ నేతలు ప్రసంగించనున్నారు.
2022లో ChatGPT ప్రారంభమైనప్పటి నుంచి AI అనేక పరిశ్రమలకు విస్తరించింది.హెల్త్‌కేర్ నుంచి ఫైనాన్స్ వరకు అన్ని రంగాలు AI టూల్స్ ఉపయోగించుకుంటున్నాయి.
అయితే, AI టెక్నాలజీ మేలుకంటే ముప్పే ఎక్కువగా ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
గతంలో నిర్వహించిన AI సమ్మిట్‌లు ప్రధానంగా సేఫ్టీ, నాన్-బైండింగ్ అగ్రిమెంట్స్ పై దృష్టి సారించాయి.
2023లో యూకేలో జరిగిన AI సమ్మిట్ లో 28 దేశాలు AI ప్రమాదాలను నియంత్రించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి.
దక్షిణ కొరియాలో జరిగిన తరువాతి సమ్మిట్ కూడా ఈ కృషిని బలోపేతం చేసింది.
వివరాలు
ఆశిస్తున్న ఫలితాలు:
కానీ పారిస్ AI సమ్మిట్ లో కేవలం AI భద్రత మాత్రమే కాదు,AI నైతికత,పర్యావరణ అనుకూలత, సామాజిక ప్రభావం వంటి అంశాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.."AI అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు స్పష్టమైన నియమాలు అవసరం"అని తెలిపారు.
ఈ సమ్మిట్ ద్వారా AI అభివృద్ధిపై గణనీయమైన కమిట్మెంట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎథికల్,సమానమైన,పర్యావరణ అనుకూలమైన AI అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే రాజకీయ ప్రకటన చేయడం ముఖ్య లక్ష్యంగా ఉంది.
అయితే,యునైటెడ్ స్టేట్స్ ఈ ప్రకటనకు పూర్తిగా మద్దతు ఇస్తుందా? లేదా?అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు చైనా AI రంగంలో వేగంగా ఎదుగుతోంది.గ్లోబల్ AI అభివృద్ధిని ప్రోత్సహించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,వైస్ ప్రీమియర్ జాంగ్ గుయోకింగ్‌ను ప్రతినిధిగా పంపించారు.
వివరాలు
ఏఐపై యూఎస్ వైఖరి:
చైనా ఇటీవల విడుదల చేసిన "DeepSeek AI"అనే చాట్‌బాట్, OpenAI మోడల్స్‌కు పోటీగా నిలుస్తోంది.
తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ మోడల్, కంప్యూటింగ్ పవర్‌లో ఎక్కువ పెట్టుబడులు అవసరం లేదని నిరూపించింది.
కానీ OpenAI డేటాను దొంగిలించిందన్న ఆరోపణలతో U.S. దీన్ని కొన్ని దేశాల్లో నిషేధించింది.
వివరాలు
AI నియంత్రణపై ఉద్రిక్తతలు:
AI నియంత్రణపై గ్లోబల్ చర్చలు కూడా ఆసక్తికరంగా మారాయి.యూరోపియన్ యూనియన్ (EU)కఠినమైన AI నియంత్రణలను అమలు చేయాలని కోరుతోంది.
యాంటీట్రస్ట్ చట్టాలు, ప్రైవసీ హక్కులు వంటి అంశాలపై EU ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజాలతో వివాదాల్లో ఉంది.
మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఈ కొత్త నియమాలు ఆవిష్కరణకు అడ్డుగా మారతాయని EUని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ కూడా అమెరికన్ కంపెనీలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి, పారిస్ AI సమ్మిట్ 2025 ప్రపంచ నాయకులను ఒకేచోట చేర్చుతూ AI భవిష్యత్తు దిశలో కీలక నిర్ణయాలు తీసుకునే వేదికగా మారనుంది.
ఈ సమ్మిట్ ద్వారా సురక్షితమైన, నైతికత ఆధారిత, సమాజానికి మేలు చేసే AI అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.