
Ajit Agarkar: అజిత్ అగార్కర్ పదవీ కాలం 2026 వరకు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముఖ్య సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవిని మరోసారి పొడిగించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం, అగార్కర్ పదవీకాలం ఇప్పుడు 2026 జూన్ వరకు కొనసాగనుంది. ఆయన మొదటి టర్మ్ 2023 జూన్‌లో ప్రారంభమైంది. అప్పటి నుండి టీమిండియా 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్, అలాగే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
వివరాలు
అగార్కర్ తొలి టర్మ్‌లో విజయాలు
అగార్కర్ నేతృత్వంలో భారత్ 2023లో దేశంలోనే జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అలాగే టెస్టు క్రికెట్‌లో కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్స్ మధ్యలో జట్టులో మార్పులు జరిగాయి. రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ వన్డేల్లో కొనసాగారు. ఈ మార్పుల నడుమ శుభమన్ గిల్‌ను టెస్టులకు, సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు కొత్త కెప్టెన్‌గా నియమించారు.
వివరాలు
ప్రస్తుత సెలక్షన్ కమిటీ, రానున్న మార్పులు
ప్రస్తుతం అగార్కర్‌తో పాటు ఎస్.ఎస్.దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్. శరత్ సభ్యులుగా ఉన్నారు. అయితే సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) తరువాత కొంతమంది స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. 2021 సెప్టెంబర్‌లో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన శరత్, 2023 జనవరిలో సీనియర్ కమిటీలోకి ప్రమోషన్ పొందారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని BCCI ఎంపిక చేసే అవకాశముంది.
వివరాలు
మహిళల, జూనియర్ జట్లలో మార్పులు
ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీపై బీసీసీఐ సంతృప్తిగా ఉన్నప్పటికీ ఒకే ఒక్క మార్పు చేసే అవకాశం ఉందని సమాచారం. అదనంగా, మహిళల సీనియర్ టీమ్, పురుషుల జూనియర్ టీమ్‌లకు కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించనుంది. మహిళల సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ నీతూ డేవిడ్‌తో పాటు ఆరతి వైద్య, మిథు ముఖర్జీ పదవీకాలం ఐదేళ్లకు చేరుకుంటోంది. బోర్డు నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు గరిష్టంగా ఐదు సంవత్సరాలు మాత్రమే సెలెక్టర్‌గా కొనసాగవచ్చు.