Page Loader
Shubman Gill: రేపటి నుండి ఇంగ్లండ్‌,టీమిండియా మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం.. సిరీస్‌ అంచనాలపై ఓ లుక్ 
రేపటి నుండి ఇంగ్లండ్‌,టీమిండియా మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం.. సిరీస్‌ అంచనాలపై ఓ లుక్

Shubman Gill: రేపటి నుండి ఇంగ్లండ్‌,టీమిండియా మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం.. సిరీస్‌ అంచనాలపై ఓ లుక్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జరగనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా యువ బ్యాటర్‌ శుభమన్‌ గిల్‌ కెప్టెన్‌గా, రిషభ్‌ పంత్‌ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత టెస్ట్‌ జట్టుకు ఇది ఒక కీలక ఘట్టం. గిల్‌ నేతృత్వంలో భారత టెస్ట్‌ జట్టు కొత్త దిశగా పయనించనుండటం ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

వనరులను సమర్థంగా వినియోగించాల్సిన సమయం 

ప్రస్తుతం టీమ్‌ ఇండియా టెస్ట్‌ క్రికెట్‌ మైలురాయి దశలో ఉంది.ఈ సందర్భంగా శుభ్‌మన్‌ గిల్‌కి లభించిన వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం అత్యంత అవసరం. ఐపీఎల్‌ మ్యాచ్‌లు,టెస్ట్‌ మ్యాచ్‌ల మధ్య తేడా ఉన్నా కూడా,గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా గిల్‌ ఇచ్చిన ఫలితాలు అతనికి అనుభవాన్ని అందించాయి. గత రెండు సీజన్లలో గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు నాయకత్వం వహించి,ఈ సారి జట్టును ప్లేఆఫ్స్‌ వరకు తీసుకెళ్లాడు. గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయంపై బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ, "మైదానంలో గిల్‌ ప్రదర్శనతోపాటు అతని నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం" అని స్పష్టం చేశారు.

వివరాలు 

నాడు ధోనీ.. నేడు గిల్‌..! 

అందరినీ సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్లగల గుణం గిల్‌లో ఉంది కాబట్టే అతడిని కెప్టెన్సీ వరించింది. ఒకప్పుడు ఎంఎస్‌ ధోని కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. అప్పట్లో కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లను పక్కనబెట్టి భారత జట్టుకు నాయకత్వ బాధ్యతలు ధోనీకి అప్పగించారు. అనంతరం ధోనీ సారథ్యంలో టీమ్‌ ఇండియా ఎన్నో ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు అదే తరహాలో గిల్‌ కూడా సవాళ్లను ఎదుర్కొంటూ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గిల్‌కు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది. అలాగే, అతనిలో ఉన్న సమన్వయం, ఓర్పుతో జట్టును ముందుకు నడిపించే నైపుణ్యంపై క్రికెట్‌ విశ్లేషకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

భారం కాకుండా బాధ్యతగా 

గిల్‌ తనపై కెప్టెన్సీ భారం పడకుండా ఆడగలడు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి, అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడు. అటు బ్యాట్స్‌మన్‌గా రాణిస్తూ, ఇటు జట్టును నాయకత్వంతో ముందుకు నడిపించగల శక్తి అతనికి ఉంది. "రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల మధ్య గల నైపుణ్యాలు గిల్‌లోనూ ఉన్నాయి" అని ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌ మైదానాల్లో ఆడటం అనేది టీమిండియాకు సవాలుతో కూడుకున్న పని. కానీ,ఇది సాధ్యం కానిది కాదు.

వివరాలు 

సమతూకం సానుకూలాంశం!  

ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ స్టైల్‌ క్రికెట్‌కు గతంలో మన జట్టు సమర్థవంతంగా బదులిచ్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యువతర బ్యాటర్లు సాయి సుదర్శన్‌,యశస్వి జైస్వాల్‌,రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి దూకుడు ఆటగాళ్లు ఉన్నారు. అలాగే కరుణ్‌ నాయర్‌ వంటి టెస్ట్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఉన్నాడు.బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌,శార్దూల్‌ ఠాకూర్‌,అర్ష్‌దీప్‌ సింగ్‌,ప్రసిద్ధ్‌ కృష్ణ,కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి పలువురు ప్రతిభావంతులు ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా,వాషింగ్టన్‌ సుందర్‌,నితీశ్‌ కుమార్‌ రెడ్డి వంటి ఆటగాళ్లు జట్టుకు సమతూకాన్ని అందిస్తున్నారు. ఈ సమతూకం,గిల్‌ నైపుణ్యం కలిసి పనిచేస్తే..ఈ యువ భారత జట్టు ఇంగ్లండ్‌లో చారిత్రాత్మక విజయాలను నమోదు చేసే అవకాశం ఉంది.