
Ajit Doval: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం: అజిత్ దోవల్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడులు జరిపిన నేపథ్యంలో, ఈ వివరాలను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర దేశాలకు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా, ఆయా దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆయన చైనా, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు.
భారతదేశం ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచాలనుకోవడం లేదని, అయితే పాకిస్థాన్ అటువంటి దిశగా వ్యవహరిస్తే మాత్రం భారతదేశం ప్రతికార చర్యలకు సిద్ధంగా ఉంటుందని దోవల్ స్పష్టంగా చెప్పారు.
వివరాలు
ఎనిమిది దేశాల ప్రతినిధులతో చర్చలు
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సిన పరిస్థితులు తదితర అంశాలను ఆయా దేశాధికారులకు వివరించినట్లు సమాచారం.
ఆపరేషన్ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడుల విషయాలను కూడా ఆయన వివరించారు.
భారతదేశానికి మిత్ర దేశాలతో భవిష్యత్తులోనూ భద్రతా సంబంధిత సమాచారాన్ని పంచుకుంటామని దోవల్ వెల్లడించారు.
ఇప్పటి వరకు ఆయన ఎనిమిది దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదు స్థావరాలపై సుదీర్ఘ దాడులు జరిపింది.
వివరాలు
పూంచ్‌లో 2023, 2024లో జరిగిన ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాదులు
అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన గుల్పూర్ టెర్రర్ క్యాంప్ సహా మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు క్షిపణుల దాడులు నిర్వహించాయి.
రాజౌరి-పూంచ్ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులు ఈ దాడుల్లో లక్ష్యంగా మారారు.
పూంచ్‌లో 2023, 2024లో జరిగిన ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాదులు ఇదే ప్రాంతాల్లో శిక్షణ పొందినట్లు భారత భద్రతా సంస్థలకు సమాచారం ఉంది.
ఈ దాడుల అనంతరం దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలొస్తున్నాయి.
ఇందులో బహావల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ శిబిరం, మురిద్కేలోని లష్కరే తోయిబా శిబిరాల్లో అత్యధిక మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.