Best Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..!
2023 ఏడాది ముగింపునకు వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది క్రికెట్‌లో ఎన్నో సంచలన విజయాలు నమోదయ్యాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ విజయంలో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డులను సృష్టించింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు వరల్డ్ కప్‌లో ఫేలవ ప్రదర్శనతో చెత్త రికార్డును మూటకట్టుకున్నాయి. మరోవైపు విండీస్ జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయా జట్లలోని ఆటగాళ్లు ఈ ఏడాది అద్భుత ప్రదర్శనతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. 2023లో సత్తా చాటిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (భారత్) విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. ఈ ఏడాది మొత్తం 27 వన్డేలు ఆడిన కోహ్లీ 1377 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధసెంచరీలున్నాయి. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా కూడా కోహ్లీ నిలిచాడు. ఇక ఏడు టెస్టుల్లో విరాట్ 55.70 సగటుతో 557 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. టెస్టుల్లో అత్యధికంగా 186 పరుగులు చేశారు. విరాట్ ఈ ఏడాది 14 ఐపీఎల్ మ్యాచుల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.
వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా శుభమాన్ గిల్
శుభమాన్ గిల్ (భారతదేశం) టీమిండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఈ ఏడాది భారీగా పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో ఏకంగా రోహిత్, కోహ్లీలను అధిగమించాడు. మొత్తంగా ఈ ఏడాది 29 మ్యాచులు ఆడి 1584 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలున్నాయి. అదే విధంగా వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో గిల్ 230 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 13 టీ20 మ్యాచుల్లో 26.00 సగటుతో 312 పరుగులు చేశారు. ఈ ఏడాది మొత్తం మీద 47 అంతర్జాతీయ మ్యాచ్‌లలో గిల్ 48.31 సగటుతో 2,126 పరుగులు చేశాడు. ఇందులో ఏడుసెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి.
ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన గిల్
ఇక ఐపీఎల్‌లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరఫున 17 ఇన్నింగ్స్‌లలో 59.33 సగటుతో 890 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఐపీఎల్‌లో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలను బాదాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన గిల్ 'ఆరెంజ్ క్యాప్' ను సొంతం చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌తో ఆస్ట్రేలియా జట్టుకు మరుపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్‌లో శతకాలతో చెలరేగి ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2023లో మూడు శతకాలు బాదిన ట్రావిస్ హెడ్
ఈ ఏడాది 11 టెస్టుల్లో ట్రావిస్ హెడ్ 902 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలను బాదాడు. ఈ ఏడాది 13 వన్డేల్లో హెడ్ 51.81 సగటుతో 570 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం 30 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 45.43 సగటుతో 1,681 పరుగులను సాధించాడు. మొత్తం మీద మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలను చేశాడు.
సరికొత్త రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (భారత్) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుసగా పది విజయాలను అందించి సరికొత్త రికార్డును సృష్టించాడు. మొత్తం మీద 27 వన్డేలు ఆడి 1255 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ ఈ ఏడాది 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు చేశాడు. ఈ ఏడాది ఏడు టెస్టుల్లో, 11 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీల సాయంతో 540 రన్స్ చేశాడు. ఈ ఏడాది 34 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 1,795 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫ్లేఆఫ్ కు తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించాడు.
టెస్టుల్లో అత్యధికంగా 195* రన్స్ చేసిన ఉస్మాన్ ఖవాజా
ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, యాషెస్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది 12 టెస్టుల్లో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో 55.61 సగటుతో 1,168 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 195* పరుగులను చేశాడు. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) న్యూజిలాండ్ ఆటగాడు డెరెల్ మిచెల్ ఈ ఏడాది 26 మ్యాచులు ఆడి 1204 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. ఏడు టెస్టుల్లో 42.63 సగటుతో 469 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తంమీద అతను 48 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 41.61 సగటుతో 1,956 పరుగులను చేశాడు.
2023లో మూడు సెంచరీలు బాదిన మిచెల్ మార్ష్
మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ ఏడాది బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేశాడు. యాషెస్, ఐసిసి వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సంవత్సరం నాలుగు టెస్టుల్లో మార్ష్ 67.16 సగటుతో 403 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలున్నాయి. ఈ ఏడాది 20 వన్డేల్లో మార్ష్ 47.66 సగటుతో 858 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది 27 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1,447 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి.
ఈ ఏడాది 66 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (భారత్) టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది 35 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టెస్టుల్లో 33 వికెట్లు, వన్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో రెండు వికెట్లు సాధించాడు. ఏడు టెస్టుల్లో 281 పరుగులను సాధించాడు. ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కు ఐదోవ టైటిల్‌ను అందించడానికి జడేజా కృషి చేశాడు. ఐపీఎల్‌లో 12 ఇన్నింగ్స్‌లో 190 పరుగులు చేసి, 20 వికెట్లను తీశాడు. కుల్దీప్ యాదవ్ (భారతదేశం) టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది 39 మ్యాచ్‌లలో 63 వికెట్లను తీశాడు. వన్డేల్లో 49 వికెట్లు, టీ20ల్లో 14 వికెట్లు తీసి ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ ఏడాది అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన గెరాల్డ్ కోయెట్జీ
గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా) గెరాల్డ్ కోయెట్జీ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు. మొత్తం 20 మ్యాచులు ఆడి 46 వికెట్లు తీశాడు. కోట్జీ టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 31, టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఈ ఏడాది విమర్శకుల నోళ్లను మూయించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించి సంచలన చరిత్రను నమోదు చేశాడు. కమిన్స్ ఈ ఏడాది 23 మ్యాచ్‌లలో 49 వికెట్లను పడగొట్టి ఆసీస్ జట్టుకు మరుపురాని విజయాలను అందించాడు. టెస్టుల్లో 32 వికెట్లు, వన్డేల్లో 17 వికెట్లను తీశాడు. బ్యాటింగ్ విభాగంలో 26 ఇన్నింగ్స్‌లలో 393 పరుగులు చేశాడు.