
ENG vs IND: లార్డ్స్ టెస్టు ముందు గిల్ ను ఊరిస్తున్న రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత్,రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణం కెప్టెన్ శుభమన్ గిల్ మళ్లీ తన క్లాస్‌ను చూపించడమే. ఒక డబుల్ సెంచరీతో పాటు ఒక శతకం సాధించిన గిల్, మ్యాచ్‌ను భారత్‌కు ఊహించని విజయం అందించాడు. ఇప్పుడు లార్డ్స్ టెస్టులో గిల్ రికార్డుల దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ ఇప్పటికే రెండు టెస్టుల్లో 585 పరుగులు సాధించాడు. ఇంకా కేవలం 18 పరుగులు చేయగలిగితే, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచే అవకాశం గిల్ కి ఉంది.
వివరాలు
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే అవకాశం
ఇప్పటివరకు ఆ రికార్డు రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది, ఆయన 2002లో మూడు సెంచరీల సహాయంతో మొత్తం 602 పరుగులు చేశారు. అదే సమయంలో గిల్ మరో 9 పరుగులు చేయగలిగితే చాలు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ఒకే టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా స్థానం దక్కుతుంది. ఇప్పటివరకు ఆ ఘనత విరాట్ కోహ్లీపేరున ఉంది. 2018లో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ కోహ్లీ 593 పరుగులు చేశాడు. ఇక గిల్ మరో 71 పరుగులు చేస్తే కోహ్లీ పేరిటే ఉన్న ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన సారథిగా మారతాడు (కోహ్లీ: 655).
వివరాలు
గవాస్కర్‌ను అధిగమించే అవకాశం
ఒకే టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సునీల్ గవాస్కర్ ఇప్పటికీ రికార్డు కలిగి ఉన్నాడు. ఆయన 1971లో వెస్టిండీస్‌పై నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించాడు. గిల్ ఆ మార్కును చేరాలంటే ఇంకా 190 పరుగులు చేయాలి. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, ఈ లక్ష్యం అధిగమించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌పై (ఏవైనా వేదికలో) భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవాలంటే గిల్ ఇంకా 128 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది, అతడు గతేడాది భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో 712 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
బ్రాడ్‌మన్ రికార్డును అధిగమించే అవకాశం
అంతర్జాతీయ స్థాయిలో ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఈ ఆస్ట్రేలియన్ దిగ్గజం 1930లో ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టుల్లో మొత్తం 974 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో వాలీ హమ్మండ్ ఉన్నాడు, అతడు 1928-29లో ఆసీస్‌పై 908 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ ఇద్దరే 900కు పైగా స్కోరు చేసిన ఆటగాళ్లు. గిల్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లోనే 585 పరుగులు చేయగా, మరో 390 పరుగులు చేయగలిగితే బ్రాడ్‌మన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది.
వివరాలు
లార్డ్స్ పిచ్ పేస్‌కు అనుకూలం
ఇక బౌలింగ్ పరంగా చూస్తే, లార్డ్స్‌లో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడు ఇషాంత్ శర్మ. 2014లో అతడు 7 వికెట్లు తీసి (7/74) అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. అయితే ఈసారి లార్డ్స్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండబోతున్నట్లు అంచనాలు. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈసారైనా ఆ గణాంకాలను అధిగమించే అవకాశం ఉందేమో చూడాలి.