LOADING...
Netanyahu: గాజాను ఆక్రమించం.. హమాస్‌ నుంచి విముక్తి ప్రసాదిస్తాం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
గాజాను ఆక్రమించం.. హమాస్‌ నుంచి విముక్తి ప్రసాదిస్తాం.. నెతన్యాహు సంచలన నిర్ణయం

Netanyahu: గాజాను ఆక్రమించం.. హమాస్‌ నుంచి విముక్తి ప్రసాదిస్తాం.. నెతన్యాహు సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజా (Gaza)పై పూర్తి అధిపత్యాన్ని సాధించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ (Israel) మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఈ నిర్ణయం కీలక మలుపు కావచ్చని భావిస్తున్నారు. అయితే, టెల్‌అవీవ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయ నాయకులు మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్‌లోని పలు నేతలు కూడా గట్టి విమర్శలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రణాళికపై స్పష్టత ఇవ్వడానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ముందుకు వచ్చారు.

వివరాలు 

భవిష్యత్తులో అక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు జరగకుండా ప్రణాళిక

గాజాను పూర్తిగా ఆక్రమించాలన్న ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని నెతన్యాహు ఎక్స్‌లో (X) పోస్టు చేశారు. ఆ ప్రాంతాన్ని హమాస్‌ (Hamas) నియంత్రణ నుంచి విముక్తి చేయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో అక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు జరగకుండా చేయడం తమ ప్రణాళికలో భాగమని వివరించారు. శాంతియుత పౌర పరిపాలనను నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పాలస్తీనా లేదా హమాస్‌ సహా ఇతర ఉగ్రవాద సంస్థలు పాలనలో భాగం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ చర్య హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించడంలో దోహదపడుతుందని, అలాగే భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయెల్‌కు ఎటువంటి భద్రతా ముప్పు రాకుండా చేస్తుందని వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెంజమిన్‌ నెతన్యాహు చేసిన ట్వీట్ 

వివరాలు 

టెల్‌అవీవ్‌కు యుద్ధ సామగ్రి సరఫరా చేయబోమని స్పష్టం చేసిన జర్మనీ 

గాజా యుద్ధానికి ముగింపు పలకడానికి ఐదు అంశాలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను ఇజ్రాయెల్‌ భద్రతా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి అనేక దేశాలు ఖండించాయి. టెల్‌అవీవ్‌కు యుద్ధ సామగ్రి సరఫరా చేయబోమని జర్మనీ స్పష్టంగా ప్రకటించింది. ఈ వైఖరిని నెతన్యాహు తీవ్రంగా తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ కూడా ఈ ప్రణాళికను ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లక్షలాది పాలస్తీనియన్ల పరిస్థితి మరింత విషమించవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి ఆదివారం సమావేశం కానుందని అధికార వర్గాలు తెలిపాయి.

వివరాలు 

హమాస్‌ నిర్బంధంలో 49 మంది

ఇజ్రాయెల్‌ నిర్ణయంపై దేశీయంగా విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. హమాస్‌ చెరలో ఉన్న బందీల కుటుంబాలు దీన్ని నిర్లక్ష్యపు నిర్ణయంగా ఖండించాయి. మరోవైపు, కొందరు మాత్రం ఈ ప్రణాళికకు మద్దతు తెలిపారు. ప్రస్తుతానికి హమాస్‌ నిర్బంధంలో 49 మంది ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌ మంత్రివర్గ నిర్ణయాన్ని హమాస్‌ తీవ్రంగా విమర్శించింది. గాజా నగరాన్ని ఆక్రమించి, అక్కడి ప్రజలను బలవంతంగా తరలించే ప్రయత్నం నేరమని పేర్కొంది.