
Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో, ఉభయ సభల సమావేశాలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. అధికార వర్గాల ప్రకారం, ఈ భేటీ మోదీ ఇటీవల బ్రిటన్, మాల్దీవుల పర్యటనల నుంచి తిరిగొచ్చిన అనంతరం సాధారణ మర్యాద పూర్వక సమావేశంగా నిర్వచించారు. అయినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం పార్లమెంటులో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినదిగా అంచనా వేస్తున్నారు.
వివరాలు
నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఇక, ఒడిశా రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలపై వివరణ ఇవ్వడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిసినట్టు అధికార వర్గాల సమాచారం. అయితే, మరోవైపు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై మోదీ, అమిత్ షా రాష్ట్రపతితో చర్చించినట్టు కొన్ని వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా వివాదం రోజురోజుకీ ముదురుతుండటంతో, ప్రతిపక్షాలపై దూకుడు పెంచాలని భావించిన మోదీ, మంగళవారం నాడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు దృష్టిలో ఉంచుకుని జరగనుందని తెలుస్తోంది. మొత్తం ఎన్డీయే ఎంపీలను ఏకతాటిపైకి తెచ్చి, అధికార కూటమి అభ్యర్థి విజయాన్ని ఖాయంచేయడానికి అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం.
వివరాలు
ఈ నెల 7న ప్రతిపక్షాల సమావేశం
ప్రతిపక్షాలు కూడా తమ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 7వ తేదీన సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమి నేతలందరూ బిహార్ ఓటర్ల జాబితా అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, ఈ నెల 8న ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయం వరకు పెద్ద ఊరేగింపుగా వెళ్లాలని వారు నిర్ణయించినట్టు సమాచారం.