Telangana Rains: భారీ వర్షాలు.. సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
కుంభవృష్టి వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో సింగరేణి సహా దేశ వ్యాప్తంగా గనుల్లో నీరు చేరడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది. రోజుకు 2.20 లక్షల టన్నుల బొగ్గు కావాలని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణిని అడుగుతున్నా, ఉత్పత్తి కేవలం 1.10 లక్షల టన్నుల వరకు మాత్రమే జరుగుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నిరంతర ఉత్పత్తి కొనసాగేందుకు 5.36 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు అవసరమని, కానీ సెప్టెంబర్ 6న 1.38 కోట్ల టన్నుల కొరత ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, దేశంలో 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోయి పరిస్థితి అత్యంత సంక్షోభంగా మారింది.
బొగ్గు నిల్వ 37 శాతమే..
వివిధ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలు,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటకలు, బొగ్గు కొరతను కేంద్రానికి నివేదించాయి. బొగ్గు నిల్వలు తగ్గకుండా అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సాధారణంగా 2.99 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కలిగి ఉండాలి కానీ ఇప్పుడు కేవలం 1.07 లక్షల టన్నులే మిగిలాయి. భద్రాద్రి జిల్లాలో ఉన్న తెలంగాణ జెన్‌కోకు చెందిన భద్రాద్రి విద్యుత్ కేంద్రంలో సాధారణంగా ఉండాల్సిన 3.33 లక్షల టన్నుల బదులుగా కేవలం 37 శాతం మాత్రమే నిల్వగా ఉంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం కూడా 1.64 లక్షల టన్నుల బదులు కేవలం 48 శాతం నిల్వ కలిగివుంది.
నార్ల తాతారావు థర్మల్ కేంద్రంలో 2 లక్షల టన్నులే నిల్వ
ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ కేంద్రంలో 9.39 లక్షల టన్నులకు గాను కేవలం 2 లక్షల టన్నులే ఉన్నాయి. ఏపీ జెన్‌కోకు చెందిన అన్ని థర్మల్ కేంద్రాలు కలిపి 14.72 లక్షల టన్నుల బదులుగా కేవలం 3.41 లక్షల టన్నులే నిల్వగా ఉన్నాయి. ఏపీ థర్మల్ కేంద్రాలకు బొగ్గు దూర ప్రాంతాల నుంచి రావడం, రవాణా సమస్యలు వంటి వాటి వల్ల బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి.
విద్యుత్ డిమాండ్ తగ్గడంతో..
వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల బొగ్గు కొరత తీవ్రత కొంత వరకు తెలియడం లేదు. ఉదాహరణకు, తెలంగాణలో గత నెల 29న 304.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఆగస్టు 1న 158, 2న 171 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయింది. భారీ వర్షాలు కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గడంతో బొగ్గు అవసరం కూడా తగ్గింది.