
Team india: భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది: సచిన్ టెండూల్కర్
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని గంటల్లో ఇంగ్లండ్, భారత్ మధ్య హెడ్డింగ్లీ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమ్‌ఇండియా విజయంపై తన అంచనాలు వెల్లడించాడు. శుభమన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ సిరీస్‌ను 3-1 తేడాతో విజయం సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత్ ఆడే తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా, డబ్ల్యూటీసీ నూతన సైకిల్‌లో భారత్ మొదటిసారి బరిలోకి దిగుతున్న టెస్ట్ సిరీస్ ఇదే.
వివరాలు
భారత జట్టు 3-1 తేడాతో విజయం సాధించే అవకాశాలు
ఈ నేపథ్యంలో సచిన్ తెందుల్కర్ ఒక క్రీడా ఛానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. "ఈ సిరీస్‌లో భారత జట్టు 3-1 తేడాతో విజయం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడు. అయితే అతడికి ఇతర బౌలర్ల సహకారం అవసరం. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి బౌలర్లు సహాయక పాత్రలో ఉంటారు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు తమ ప్రదర్శనతో జట్టు విజయానికి తోడ్పడతారు. వీరంతా కలిసి మంచి ప్రదర్శన ఇస్తారని నాకు నమ్మకం ఉంది" అని సచిన్ విశ్లేషించాడు.
వివరాలు
ఈ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లకే జస్ప్రీత్ బుమ్రా
అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవనున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా అతనిని మొత్తం సిరీస్‌కు అందుబాటులో ఉంచలేకపోయామని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. గతంలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పికి గురయ్యాడు. అదే కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు ఆడలేకపోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తరఫున బుమ్రా బరిలోకి దిగాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో అతడు ఏఏ మ్యాచ్‌ల్లో పాల్గొంటాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు.