Page Loader
Telangana: వరంగల్‌కు క్రీడారంగంలో బంపర్ గిఫ్ట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!
వరంగల్‌కు క్రీడారంగంలో బంపర్ గిఫ్ట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

Telangana: వరంగల్‌కు క్రీడారంగంలో బంపర్ గిఫ్ట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రీడారంగంలో వరంగల్‌కు ఓ పెద్ద బహుమతి లభించనుంది. జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారు. అంతేకాదు ప్రత్యేక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన పచ్చజెండా ఊపారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు ఈ వినతులు చేశారు. సీఎం స్పందిస్తూ స్థలాన్ని పరిశీలించి, 10 రోజుల్లో జీవో జారీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Details

సానుకూలంగా స్పందించిన సీఎం

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ.6,000కోట్లతో మామునూరు ఎయిర్‌పోర్ట్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. తాజాగా వరంగల్‌లో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోరిన ఎమ్మెల్యేల విజ్ఞప్తిని సీఎం స్వీకరించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు ఈ ప్రాజెక్టులకు అనువైనవని ఎమ్మెల్యేలు వివరించగా, సీఎం వెంటనే సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ద్రోణాచార్య, అర్జున అవార్డులు పొందిన క్రీడాకారులు ఉన్నారని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారుల సంఖ్య ఎక్కువేనని సీఎంకు వారు వివరించారు.

Details

ఆనందం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు

ప్రస్తుతం హనుమకొండలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం మాత్రమే ఉండగా, నూతన స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో సంబంధిత శాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేసిన సీఎం, త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతానని స్పష్టం చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు.