
Rahul Gandhi: మోదీ తలొగ్గడం ఖాయం.. ట్రంప్ సుంకాలపై కేంద్రానికి చురకలంటించిన రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. 90 రోజుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ సుంకాలు అమల్లోకి రాకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు భారత్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చర్యలను విమర్శించిన రాహుల్.. ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారు. నమ్మకపోతే రాసిపెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. అమెరికాతో పరస్పర సుంకాల సస్పెన్షన్ గడువు జులై 9న ముగియనుండటంతో, అప్పటికల్లా చర్చలు పూర్తిచేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
Details
సుంకాల నుంచి మినహాయింపు
ఈ నేపథ్యంలో శుక్రవారం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ - "అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్‌కు పటిష్ఠమైన విధానాలున్నాయి. గడువు ముగుస్తోందన్న కారణంగా ఒప్పందాలను తడబడకుండా ఖరారు చేయదు. రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఒప్పందాలను చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత చర్చల ప్రకారం, భారత్ అమెరికా నుంచి కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది. ఇందులో టెక్స్‌టైల్ ఉత్పత్తులు, ఆభరణాలు, రత్నాలు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి రంగాలున్నాయి. అమెరికా వైపు నుంచి కూడా భారత్‌ను కొన్ని రంగాల్లో సడలింపులకు ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Details
సడలింపులకు భారత్ నిరాకరణ
ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులపై సుంకాల సడలింపు కోరుతోంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల మినహాయింపు భారత్ రైతుల ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో, ఆ విషయంపై భారత్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయంగా సున్నితమైన అంశమైనందున ఈ రంగాల్లో సడలింపులకు భారత్ నిరాకరణ వ్యక్తం చేసింది. ఇటీవల అమెరికా వెళ్లిన భారత బృందం తిరిగి రావడంతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 9వ తేదీకి ముందే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.