Vishwak Sen :టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ ఇంట్లో భారీ దొంగతనం.. ఇరవై నిమిషాల్లోనే పారిపోయిన దొంగ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నెంబర్-8లో ఉన్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది.
ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి, చేతికందిన విలువైన వస్తువులను దోచుకుని పారిపోయాడు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, దొంగను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
Details
మూడో అంతస్తులో దొంగతనం
విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో నివసిస్తోంది. ఆయన సోదరి వన్మయి బెడ్రూమ్ ఇంటి మూడో అంతస్తులో ఉంది.
అయితే ఆదివారం తెల్లవారుజామున ఆమె గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటాన్ని గమనించిన వన్మయి, ఆల్మారాలను పరిశీలించింది.
అందులో ఉన్న బంగారు ఆభరణాలు మాయమవడంతో, వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో కరాటే రాజు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Details
20 నిమిషాల్లోనే దొంగతనం
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.
సీసీటీవీ దృశ్యాల్లో తెల్లవారుజామున 5:50 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి, ఇంటి గేటును తెరిచి, డైరెక్టుగా మూడో అంతస్తుకు చేరుకున్నట్టు గుర్తించారు.
ఆ దుండగుడు వెనుక డోర్ ద్వారా విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్రూంలోకి ప్రవేశించి, అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసి, 20 నిమిషాల్లోనే పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.