Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలను సమర్థించింది. కేంద్ర వాదనలకు అనుకూలంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. జమ్ముకశ్మీ భారత యూనియన్‌లో విలీనం అయినప్పుడు పరిస్థితులను చక్కదిద్దడానికే ఆర్టికల్ 370ని తీసుకొచ్చినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు వివరించింది. భారతదేశంలో జమ్ముకశ్మీర్ విలీనమైన తర్వాత అంతర్గత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండదని పేర్కొంది. యూనియన్ ఆఫ్ ఇండియాలో జమ్ముకశ్మీర్ విలీనమైన తర్వాత ప్రత్యేక అంతర్గత సార్వభౌమాధికారం ఉండదని తాము మేము భావిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు.
ఆర్టికల్ 370 తాత్కాలికమే: సీజేఐ
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370అనేది తాత్కాలిక నిబంధన అని అన్నారు. రాష్ట్రంలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 మధ్యంతర ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 'తాత్కాలిక నిబంధన' అని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నాలుగేళ్ల తర్వాత ఈ తీర్పు రావడం గమనార్హం. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలోని తాత్కాలిక నిబంధన. దీన్ని 1949లో ప్రవేశపెట్టారు. ఈ నిబందన కింద జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు కల్పించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వంత జెండా, రాజ్యాంగం, పౌరసత్వం ఉండేలా వెసులుబాటు చేశారు. అంతేకాకుండా, బయటి వ్యక్తులు ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి వీలు లేదు. అలాగే, ఆర్టికల్ 35A కూడా ఆర్టికల్ 370 నుంచి వచ్చిందే. ఆర్టికల్ 35A అనేది రాష్ట్రంలోని శాశ్వత నివాసితులను నిర్వచించింది. దీని వల్ల స్థానికులకు ప్రత్యేక హక్కులు అందించబడ్డాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించింది. దీన్ని రెండు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.