Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!
Model Code Of Conduct: 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ప్రకటించారు. ఎన్నికల తేదీల ప్రకటనతో దేశవ్యాప్తంగా 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్' అమల్లోకి వచ్చింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలను 'ప్రవర్తనా నియమావళి' అంటారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది కొనసాగుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఎవరికి వస్తుంది? కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ కోడ్ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎవరికి వర్తిస్తుంది?
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేవలం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మాత్రమే వర్తించదు. ఇది పూర్తిగా లేదా పాక్షికంగా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చే అన్ని సంస్థలు, కమిటీలు, కార్పొరేషన్‌లు, డీడీఏ, జల్ బోర్డు మొదలైన కమీషన్‌లకు కూడా వర్తిస్తుంది. ఈ సంస్థలు తమ విజయాలను ప్రత్యేకంగా ప్రకటించడం లేదా కొత్త సబ్సిడీలను ప్రకటించడం అనేది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల సమ్మతితో ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేస్తుంది. దీని అమలు సమయంలో, రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై కొన్ని ఆంక్షలను ఈసీ విధిస్తుంది.
ప్రవర్తనా నియమావళిలో నిషేధించబడిన అంశాలు ఏమిటి?
ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత.. ఏదైనా రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించే ఏ సందర్భంలోనైనా ప్రజాధనాన్ని ఉపయోగించలేరు. ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ విమానాలు లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు. పార్టీ లేదా అభ్యర్థి ప్రయోజనాల కోసం ప్రభుత్వ వాహనాలను ఉపయోగించరాదు. అన్ని రకాల ప్రభుత్వ ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు లేదా భూమి పూజ కార్యక్రమాలు చేయకూడదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వ అధికారుల బదిలీ, పోస్టింగ్‌పై నిషేధాజ్ఞలు ఉంటాయి.
ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వొద్దు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పార్టీ సాధించిన విజయాలకు సంబంధించిన ప్రకటనల కోసం ప్రభుత్వ ఖజానా ఖర్చు చేయకూడదు. అధికార పక్షం తమ విజయాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన అన్ని హోర్డింగ్‌లు/ప్రకటనలు వెంటనే తొలగించబడతాయి. రాజకీయ పార్టీ కానీ, అభ్యర్థి కానీ, మద్దతుదారులు కానీ.. ర్యాలీ, ఊరేగింపు, ఎన్నికల సమావేశాన్ని నిర్వహించడానికి పోలీసుల నుంచి ముందస్తు అనుమతిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కులం, మతం ప్రాతిపదికన ఏ రాజకీయ పార్టీ కూడా ఓటర్ల నుంచి ఓట్లు అడగొద్దు. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను నిర్ణయించేందుకు అధికార పార్టీ ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
నియమావళిని ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడం తప్పనిసరి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఉల్లంఘించిన అభ్యర్థి లేదా రాజకీయ పార్టీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవచ్చు. ఉల్లంఘన జరిగిన ప్రాంతంలో సంబంధిత అధికారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. ఉల్లంఘించిన అంశం తీవ్రతను పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల కమిషన్ ఆ అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపే అధికారం కూడా ఉంటుంది. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు.