ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లయితే అక్కడి నుండి గుర్తుగా జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి. ఈ వస్తువులు చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. అరకు లోయ అరబికా కాఫీ: అరకులోయ అందాలు చాలా సినిమాల్లో కనిపిస్తాయి. ప్రకృతి పరంగా అరకు ఎంత అందంగా ఉంటుందో రుచిపరంగా అరబికా కాఫీ అంత మధురంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాఫీ పంటకు అనువైన ప్రదేశం ఉండటంతో ఇక్కడి ప్రజలు కాఫీని పండిస్తారు. అరబికా కాఫీ గింజలను ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ప్రాసెస్ చేసి కాఫీకి అద్భుతమైన రుచి వచ్చేలా చేస్తారు.
గుంటూరు సన్న మిరపకాయలు
గుంటూరు పేరు చెప్పగానే అందరికీ మిరపకాయలు గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో మిరప పంటను అధికంగా పండిస్తారు. ఇక్కడ సన్న మిరపకాయలకు భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలుగా ఈ సన్న రకానికి పేరుంది. ఉదయగిరి కలప కళాకృతులు: దాదాపు 200సంవత్సరాల నుండి ఉదయగిరి కలప కళాకృతులను తయారు చేస్తున్నారు. ఈ కళాకృతులు పర్యావరణహితంగా ఉంటాయి. దుర్గంపల్లి కొండల్లో దొరికే కలపతో ఈ కళాకృతులను తయారు చేస్తారు. చెంచాలు, కత్తులు, ఫోర్క్, ఇలా రకరకాల ఆకృతులను ఈ కలుపతో తయారు చేస్తారు.
కొండపల్లి బొమ్మలు
ఎవరైనా అమ్మాయిని వర్ణించేటప్పుడు కొండపల్లి బొమ్మలా ఉందని కవులు చెబుతుంటారు. కొండపల్లి బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో ఈ వర్ణనతో అర్థం చేసుకోవచ్చు. తెల్ల పొనికి చెట్టు నుండి వచ్చే కలపతో వీటిని తయారు చేస్తారు. ఇవి చాలా తేలికగా ఉంటాయి. వీటికి సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులు అద్దుతారు. మచిలీపట్నం కలంకారి: పువ్వులు, పండ్లు, విత్తనాలు, వేర్లతో తయారైన రంగులను ఈ కళాకృతులకు అద్దుతారు. ముందుగా ఒక వస్త్రంపై వివిధ రకాల చిత్రాలు వేసి వాటికి పువ్వులు, పండ్లు, విత్తనాలు, వేర్లతో తయారైన రంగులను అద్ది అందంగా తయారుచేస్తారు. మచిలీపట్నం సమీపంలోని పెడన ప్రాంతంలో ఈ కళాకృతి అభివృద్ధి చెందింది.