NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా?
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది. నోటాను ప్రవేశపెట్టినప్పటి నుంచి చాలా ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల సీజన్‌కు నోటా బటన్‌ను నొక్కే వారు పెరుగుతున్నారే కానీ.. తగ్గడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోటాపై మరోసారి చర్చ జరుగుతోంది. నోటా అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎన్నికల నియమావళిలోని 49(ఓ) నిబంధన ఏం చెబుతోంది? ఈ నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది? ఎన్నికలు రద్దయి మళ్లీ ఎన్నికలు వస్తాయా? ఇలా అనేక సందేహాలకు ఇప్పుడు సమాధానాలను తెలుసుకుందాం.
నోటా అవసరం ఎందుకు వచ్చింది?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినట్లు అయితే.. ఓటరు తన ఓటు వేయడానికి ఆసక్తి చూపడు. ఈ క్రమంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా నోటా(NOTA) ఆప్షన్ తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం 2009లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నోటా అంటే.. నన్ ఆఫ్ ది ఎబోవ్ అని అర్థం. అనంతరం నోటాను ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఆ సమయంలో నోటాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నోటా ఆప్షన్‌ను తీసుకురావాలని 2013లో తీర్పు చెప్పింది.
'నోటా'ను అమలు చేస్తున్న 14వ దేశం భారత్
2013న సెప్టెంబర్ 27న సుప్రంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత.. ఓటర్లకు నోటా ఆప్షన్ అందించిన 14వ దేశంగా దేశంగా భారత్ అవతరించింది. భారతదేశానికి ముందు, అమెరికా, కొలంబియా, ఉక్రెయిన్, రష్యా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిన్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీ, స్వీడన్, బెల్జియం, గ్రీస్‌తో సహా 13 దేశాల్లో 'నోటా' ఆప్షన్ అమల్లో ఉంది. వీటిలో కొన్ని దేశాలు నోటాను తిరస్కరించే హక్కును కలిగి ఉన్నాయి. అంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయబడుతుంది. ఆయా దేశాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. అయితే భారత్‌లో ఇలాంటి కఠిన నిబంధనలు లేవు.
49(ఓ)సెక్షన్ ఏం చెబుతుంది? నోటా కంటే ముందు అభ్యర్థులను తిరస్కరించే ఆప్షన్ ఉందా?
ప్రజా ప్రాతినిథ్య చట్టం 1961లోని 49(ఓ)సెక్షన్ ఓటు వినియోగం గురించి చెబుతుంది. వాస్తవానికి నోటా కంటే ముందు కూడా అభ్యర్థులు నచ్చకుటే, తిరస్కరించే హక్కును ఓటరుకు రాజ్యాంగం కల్పించింది. 49(ఓ)సెక్షన్ ఈ హక్కును కల్పించింది. అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్‌అధికారి వద్ద ఓటరు 17ఏ ఫారంను తీసుకొని నింపాల్సి ఉంటుంది. ఆ ఫారంలో ఏ అభ్యర్థని తిరస్కరిస్తున్నావో చెబుతూ.. సంతకం కానీ, వేలిముద్ర కానీ వేయాల్సి ఉంటుంది. దీనిపై పోలింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు వేయాల్సి ఉంటుంది. ఈ విధానం రహస్య బ్యాలెట్‌విధానానికి ఇది విరుద్ధమనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. దీంతో ఇందులోకి ప్రతికూల అంశాలను సవరించి.. ఈసీ ఈజీగా ఉండేలా.. నోటాను తీసుకొచ్చింది.
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం అవుతుంది?
భారతదేశంలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయని మీరు కూడా అనుకుంటే పొరపాటే. భారతదేశంలో ఎన్నికలను తిరస్కరించే హక్కు నోటాకు లేదు. ఉదహారణకు లక్ష ఓట్లతో నోటా మొదట స్థానంలో నిలిచి.. 99,999 ఓట్లతో అభ్యర్థి రెండో స్థానంలో నిలిస్తే.. అతడినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు వేసే ఓట్లను.. రద్దు చేసిన ఓట్ల కేటగిరీలో ఉంచుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకే భారత్‌లో నోటాకు పడిన ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపవు. అయితే విచిత్రం ఏంటంటే.. దేశంలో ప్రతి ఏటా నోటాకు పడుతున్న ఓట్లు పెరుగుతున్నాయో కానీ, తగ్గడం లేదు.