Page Loader
WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 
లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?

WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 

వ్రాసిన వారు Stalin
Jun 21, 2023
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది. లింగ సమానత్వంలో భారతదేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకున్నట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. 146 దేశాల్లో భారత్ ఈ ఏడాది 127వ స్థానంలో నిలిచింది. డబ్ల్యూఈఎఫ్ గతేడాది విడుదల చేసిన నివేదికలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 146 దేశాల్లో భారత్‌కు 135 ర్యాంక్ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి భారత్ 1.4 శాతం పాయింట్లను మెరుగుపర్చుకున్నట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ముఖ్యంగా విద్య విషయంలో అన్ని స్థాయిల్లో భారత్ సమాన స్థాయిని సాధించిందని వివరించింది. మొత్తం లింగ వ్యత్యాసాన్ని భారత్ 64.3శాతం తగ్గించిందని నివేదిక పేర్కొంది.

భారత్

లింగ సమానత్వంలో ఐస్‌లాండ్ టాప్

ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలపై భారతదేశం కేవలం 36.7 శాతం మాత్రమే సమానాత్వం సాధించిందని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు 142, బంగ్లాదేశ్‌కు 59, చైనాకు 107, నేపాల్‌కు 116, శ్రీలంకకు 115, భూటాన్‌కు 103 ర్యాంక్‌లు వచ్చాయి. ఐస్‌లాండ్ వరుసగా 14వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యధిక శాతం లింగ-సమానత్వం సాధించిన దేశంగా నిలిచింది. 90శాతం కంటే ఎక్కువ లింగ వ్యత్యాసాన్ని సాధించిన ఏకైక దేశంగా ఐస్‌లాండ్ రికార్డు సృష్టించింది. రాజకీయ సాధికారతపై భారతదేశం 25.3 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది. మహిళలు 15.1 శాతం మంది పార్లమెంటేరియన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.

భారత్

100శాతం లింగ సమానత్వం సాధించడానికి 131 సంవత్సరాలు అవసరం

దక్షిణాసియా ప్రాంతం 63.4 శాతం లింగ సమానత్వాన్ని సాధించింది. మంత్రి పదవుల్లో మహిళల వాటా విషయానికొస్తే, 75 దేశాల్లో 20 శాతం లేదా అంతకంటే తక్కువ మంది మహిళా మంత్రులు ఉన్నారు. భారతదేశం, టర్కీ, చైనా వంటి జనాభా కలిగిన దేశాలలో ఏడు శాతం కంటే తక్కువ మహిళా మంత్రులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే మొత్తం లింగ వ్యత్యాసం 0.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 100శాతం లింగ సమానత్వం సాధించడానికి 131 సంవత్సరాలు అవసరం అవుతుందని నివేదిక అంచనా వేసింది. ఆర్థిక సమానత్వానికి 169 సంవత్సరాలు, రాజకీయ సమానత్వానికి 162 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.